దేశ రాజధానిలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ… బీజేపీ, కాంగ్రెస్‌లతో త్రిముఖ పోటీని ఎదుర్కొంటోంది. మొత్తం 70 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
ఢిల్లీలోని 13,766 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం ఢిల్లీ వ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మొత్తం 35,626 మంది పోలీసు సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, 2015, 2020లో జరిగిన రెండు ఎన్నికలలో విజయం సాధించింది. 70 సీట్లలో 62 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. బిజెపి కేవలం 8 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఒకానొక సమయంలో రాజధానిలో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
2015లో, ఆప్ 70 సీట్లలో 67 కైవసం చేసుకుంది, బిజెపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు.
కాగా, రేపు పోలింగ్ ముగిసాక సాయంత్రం 6.30 గంటల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అవుతాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీపార్టీ, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్‌కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తాజాగా ప్రకటించిన 12లక్షల వరకు పన్ను మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ గెలిచే స్థానాలపై అంచనా వేశారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ‘ఆప్’ 55 స్థానాల వరకూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ మహిళలు మరికొంత శ్రమ తీసుకుని పూర్తి స్థాయిలో ఓట్లు వేయడం, ఆప్‌ను గెలిపించాలని తమ భర్తలను ఒప్పించినట్లయితే 60 సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం కూడా ఉందని అన్నారు.