హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.
జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని.. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా? అని ప్రశ్నించారు.
తిరువనంతపురంలో ‘మాతృభూమి’దినపత్రిక నిర్వహించిన “మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్”లో ప్రసంగించిన ముఖ్యమంత్రి… భారత రాజ్యాంగం అందించిన హక్కులను కాపాడుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవంక అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జిడిపి సుమారు $200 బిలియన్లు అని ప్రస్తావిస్తూ, 2035 నాటికి దానిని $1 ట్రిలియన్‌కు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
కేంద్రం అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, బిజెపియేతర పార్టీలు పాలించే రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే నివేదికను ఉటంకిస్తూ, తెలంగాణ దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగ నివేదిక చెబుతోంది. రాష్ట్రం ఇప్పటికే దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. “కేంద్రం తెలంగాణ అనేక మైలురాళ్లను సాధించినందుకు మద్దతు ఇవ్వకూడదా” అని ఆయన ప్రశ్నించారు.
‘ఒక దేశం, ఒక ఎన్నిక’పై మాట్లాడుతూ… ఇది ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచన అని ఆయన అన్నారు. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రహస్య ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
తెలంగాణ రైజింగ్ అనేది కేవలం నినాదం కాదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కల అని పేర్కొంటూ, తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మార్చాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అప్పటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ 60 ఏళ్ల కలను నెరవేర్చడంతో తెలంగాణ ప్రజలు ఆమె పట్ల తమ అభిమానాన్ని చూపించారని రేవంత్ రెడ్డి అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. BRS నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కానీ వాటిని నెరవేర్చలేదని ఆయన అన్నారు.
తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, రూరల్ తెలంగాణ అనే మూడు జోన్‌లుగా విభజించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న కోర్ అర్బన్ ఏరియా 1.2 కోట్ల మందికి నివాసంగా ఉంది. కోర్ ఏరియా సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికల్ని సీఎం వెల్లడించారు.
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి ప్రపంచంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని కూడా యోచిస్తోంది. సరైన ప్రణాళికతో ఇది భారతదేశంలో అత్యంత పచ్చని, పరిశుభ్రమైన, ఉత్తమ నగరం అవుతుంది. ఇది మొదటి నికర జీరో నగరం కూడా అవుతుందని ఆయన అన్నారు.
యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తాను పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ రూ.1,82,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన అన్నారు. గత సంవత్సరం తెలంగాణ రూ.40,000 కోట్ల పెట్టుబడులను అందుకుందని తెలిపారు.
హైదరాబాద్ పర్యావరణ స్థిరత్వం కోసం తమ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. కలుషితమైన మూసీని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.