మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు, కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతీయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజలు శతాబ్దాలుగా సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్‌లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు ఇటీవలి సంవత్సరాలలో బాగా ఎక్కువైంది. ముఖ్యంగా గత ఏడాది భారతదేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగాలు 75% పెరిగాయి. ఇవి ఎక్కువగా బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.
“ భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల తీరు 2024లో ఆందోళనకరస్థాయిలో పెరిగింది. ఇది పాలక భారతీయ జనతా పార్టీ, విస్తృత హిందూ జాతీయవాద ఉద్యమం సైద్ధాంతిక ఆశయాలతో లోతుగా ముడిపడి ఉంది. మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రసంగ సంఘటనల సంఖ్య 2023లో 668 జరగ్గా… 2024లో వాటి సంఖ్య 1,165కి పెరిగింది. ఇది ఏకంగా 74.4% పెరుగుదలను సూచిస్తుంది.
ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులను “బయటి వ్యక్తులు”గా వర్ణించారు. ఇక ముస్లింలను హిందువులకు ముప్పుగా ఈ విద్వేష ప్రసంగాలు పేర్కొన్నాయి. తరచుగా ముస్లింలను “చొరబాటుదారులు”గానూ వర్ణించారు . భారతీయ ముస్లింలందరూ బంగ్లాదేశ్ వలసదారులు లేదా రోహింగ్యా శరణార్థులు అనే ఆరోపణలతో ముడిపెట్టారు. హిందూ అతివాదులు భారతీయ ముస్లింలను పరాన్నజీవులు, దొంగలుగా చిత్రీకరించారు, హిందువులకు న్యాయంగా చెందాల్సిన వనరులను ముస్లింలకు ఇచ్చారని… దురాక్రమణ చర్యల ద్వారా హిందూ సంపదను ముస్లింలు దొంగిలిస్తున్నారని ఆరోపించారు.
ఈ విద్వేష ప్రసంగాల కారణంగా దేశంలో మైనారిటీ వ్యతిరేక భావాలను, వారిపై శత్రుత్వాన్ని మరింత పెంచిందని ఇండియా హేట్‌ల్యాబ్ నివేదిక తెలిపింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ విద్వేష ప్రసంగాలకు ఆజ్యం పోసారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేషపూరిత ప్రసంగాల సంఖ్య బాగా పెరిగింది. వాస్తవమేమిటంటే ఈ విద్వేష వ్యాఖ్యల్లో దాదాపు 80% డాక్యుమెంటెడ్‌గా ఉండటం గమనార్హం.
ద్వేషపూరిత ప్రసంగంలో పెరుగుదల 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బాగా కనిపించింది. ప్రచారం సమయంలో, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు తరచుగా వినిపించాయి. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, ఇతర మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు చేసారని, తద్వారా ముస్లింలపై మరింత వివక్ష, శత్రుత్వాన్ని పెంచిందని హ్యూమన్ రైట్స్ వాచ్ గుర్తించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ విద్వేష ప్రసంగాల ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. చివరకు న్యూఢిల్లీలో ఉద్రిక్తతలు పెరగ్గా… భద్రత రీత్యా చాలా మంది ముస్లింలు… ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మకాం మార్చాల్సి వచ్చింది.
అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనించింది. భారతదేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగం, మైనారిటీలపై చర్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు, మత స్వేచ్ఛలకు ఎక్కువ రక్షణ అవసరమని నొక్కి చెప్పారు.