న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మణిపూర్ రాష్ట్ర గవర్నర్ నుండి తనకు నివేదిక అందిందని, ఇతర సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని నేను సంతృప్తి చెందానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కారణంగా, ఆ రాష్ట్ర పాలనలో అనేక మార్పులు జరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం, రాష్ట్ర పరిపాలన రాష్ట్రపతి నియంత్రణలోకి వస్తుంది. రాష్ట్రపతి తన ప్రతినిధిగా, పరిపాలనను నడిపించే బాధ్యతను గవర్నర్‌కు అప్పగిస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు చివరిసారిగా సమావేశమయ్యాక…ఆరు నెలల్లోపు తిరిగి సమావేశమవ్వాలి. మణిపూర్‌లో చివరి అసెంబ్లీ సమావేశం ఆగస్టు 12, 2024న జరిగింది.. దీనితో బుధవారం తదుపరి సమావేశానికి గడువు విధించారు. అయితే, ఆదివారం ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, సోమవారం ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ అజయ్ భల్లా రద్దు చేశారు. సీఎం రాజీనామా తర్వాత.. రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు.
అయితే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్రా గత రెండు రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థికి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్రం… రాష్ట్రపతి పాలన విధించింది. దాదాపు 21 నెలలుగా కొనసాగుతున్న జాతి హింసకు వ్యతిరేకంగా మణిపూర్‌లో కొనసాగుతున్న పోరాటంలో రాష్ట్రపతి పాలన విధించడం ఒక కీలకమైన ఘట్టం.
రాష్ట్రపతి పాలనకు తన మొదటి ప్రతిస్పందనగా, బిజెపికి చెందిన కుకి ఎమ్మెల్యే పావోలియన్‌లాల్ హవోకిప్ మాట్లాడుతూ… “మణిపూర్‌లో జాతి హింస కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు, 60 వేలకు పైగా నిరాశ్రయులయ్యారు. 200కు పైగా గ్రామాలు కాలిపోయాయి. 7వేలకు పైగా ఇళ్లు దహనమయ్యాక ఆలస్యంగా ఈ నిర్ణయం వచ్చిందని అన్నారు.
ఈ నేపథ్యంలో స్వదేశీ గిరిజన నాయకుల ఫోరం (ITLF) నాయకుడు గింజా వుల్జాంగ్ మాట్లాడుతూ…”ముఖ్యమంత్రి మార్పు కంటే రాష్ట్రపతి పాలన ఉత్తమం.” కుకి-జోలు ఇకపై మెయిటీని విశ్వసించడం లేదు, రాష్ట్రపతి పాలన కుకి-జోలకు ఆశల కిరణాన్ని ఇస్తుంది. ఇది మా రాజకీయ పరిష్కారానికి ఒక అడుగు దగ్గరగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. రాష్ట్రపతి పాలనతో, హింసను తగ్గించగలదని నేను నమ్ముతున్నాను, ఇది రాజకీయ చర్చలకు అనుకూలమైన వాతావరణానికి మార్గం సుగమం చేస్తుందని ITLF నాయకుడు గింజా వుల్జాంగ్ అన్నారు.
ఈ సందర్భంగా బిజెపి మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) ఎమ్మెల్యే నూరుల్ హసన్ మాట్లాడుతూ… “రాష్ట్రంలో శాంతి,సాధారణ స్థితి” నెలకొల్పడమే తమ ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలనలో మణిపూర్ ఎలా ఉంటుందో చూడాలి.
ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ Xలో వ్యాఖ్యానిస్తూ… ” కాంగ్రెస్ దాదాపు 20 నెలలుగా డిమాండ్ చేస్తున్నదే చివరకు జరిగింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు ‘రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని వ్యాఖ్యానించి’ తర్వాత, 2023 మే 3 నుండి 300 మందికి పైగా ప్రజలు చంపేశారు. 60,000 మందికి పైగా పురుషులు, మహిళలు,పిల్లలు నిరాశ్రయులయ్యారు.”మణిపూర్ సమాజం పూర్తిగా నాశనం కాకపోయినా తీవ్రంగా దెబ్బతిన్నాక ఇది జరిగింది. కేంద్ర హోంమంత్రి మణిపూర్ అల్లర్లను నిరోధించడంలో స్పష్టంగా విఫలమైన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారని జైరాం రమేష్ ఎక్స్‌లో విమర్శించారు.