నేటి సమాజం విద్యా విజ్ఞానాల పరంగా ఎంత ప్రగతి సాధించినా, నైతిక, సామాజిక, ఆధ్యాత్మికతల పరంగా తిరోగమనంలోనే పయనిస్తోంది. నేడు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం, సద్భావన, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. అశాంతి, అలజడులు, అనుమానం, అభద్రతాభావం, అమానవీయం తాండవ మాడుతున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం పెరుగుతోంది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి వంతొచ్చింది. ఆయనపై దాడి దేనికి సంకేతం? రంగరాజన్ బ్రాహ్మణ పూజారి అయినప్పటికీ గొప్ప లౌకికవాది, పదహారణాలా ప్రజాస్వామ్యవాది. మతోన్మాదం, పరమత ద్వేషం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన బురద గుంటలో తామర పువ్వులా తళుక్కున మెరుస్తున్నారు. పరమత సహనం కలిగి, మతసామరస్యాన్ని మనసారా కోరుకునే మనిషాయన. అందుకే మతతత్వ మూకలు ఆయన్ని టార్గెట్ చేశాయి. అంటే ఈదేశంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మతసామరస్యం కాంక్షించేవారు స్వమతం వారైనప్పటికీ వదిలిపెట్టబోమని ఈ మతోన్మాద శక్తులు చెప్పకనే చెబుతున్నాయన్నమాట. ‘రామరాజ్యం’ పేరుతో రాక్షసత్వానికి తెరలేపి, దూషించే, ద్వేషించే స్థాయినుండి ఏకంగా దాడి చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. తన ధర్మంపై స్థిరంగా ఉంటూనే, తమ ధర్మోన్నతికై పాటుపడుతూనే ఇతర మతాలను గౌరవించే రంగరాజన్ లాంటి లౌకిక, ప్రజాస్వామ్యవాదులను భయభ్రాంతులకు గురిచేసి, ఇలాంటి వారిని కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనేది ఈ దుర్మార్గుల దుష్ట పన్నాగం కావచ్చు. సంకుచిత మనస్తత్వం, కులతత్వం, మతోన్మాదం, మూకోన్మాదం దేశంలో ఎంతగా పెచ్చరిల్లిందో మనం కళ్ళారా చూస్తున్నాం. తమ స్వార్ధపూరిత, ఉన్మాద కార్యకలాపాలకు సహకరించకపోతే ఈమతోన్మాదులు ఎవరినీ వదిలిపెట్టరనడానికి ఈదాడి ఓ ఉదాహరణ. ఇంతటి విద్వేష పూరిత దాడిని కూడా సమర్ధించేవాళ్ళు మనచుట్టే ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది. అదికూడా బ్రాహ్మణ సమాజంనుంచే సుమా! ఒక దళితుణ్ణి తాకడం ధర్మ విరుధ్ధమట.. వ్యవసాయం కోసం ఎద్దును ఒక ముస్లిం రైతుకు ఇవ్వడం ధర్మవిరుధ్ధమట. ఇటువంటి భావజాలమే కదా మనుషులమధ్య దూరంపెంచింది. మనుషులంతా ఒకటికాదు, ఒక బ్రాహ్మడు దళితుణ్ణి భుజాలపై ఎలా కూర్చోబెట్టుకుంటాడు? అని ప్రశ్నిస్తున్నాడు ఒక బ్రాహ్మణ సంఘం అద్యక్షుడు. రంగరాజన్ బ్రాహ్మణుడై ఉండి, బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడైఉండి దళితుణ్ణి గుడి ప్రవేశం ఎలా చేయించగలుగుతాడు? ఒక ముస్లిం రైతుకు ఎద్దును ఎలా ఇవ్వగలుగుతాడు? గుడిలో హుండీ తీసివేయడం అతని ఇష్టమేనా? ఇలాంటి అనేక హిందూ ధర్మ వ్యతిరేక పనులు ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ చేస్తున్నాడు కాబట్టే ఆయనపై దాడి జరిగింది తప్ప, ఊరకనే జరగలేదు. రామరాజ్య స్థాపకుడు వీరరాఘవరెడ్డి చేసింది కరెక్టు కానప్పటికీ, అందులో న్యాయం ఉంది అంటున్నాడు ఈ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. రంగరాజన్ ను, ఆయన చేసే ఇలాంటి పనులను వ్యతిరేకించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి వీరరాఘవరెడ్డి ముందుకొచ్చాడు. అని వాకృచ్చాడు ఈ బ్రాహ్మణోత్తముడు. అంతేనా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని సమర్ధించినట్లు మాట్లాడాడు. అంటే, ఇదేదో యాధృచ్చికంగా జరిగిన సంఘటన కాదని, దీనివెనుక సంఘ్ పరివార్ భావజాలం కలిగిన పెద్ద ముఠానే ఉన్నదని అర్ధమవుతోంది. ఈఖండన మండనలన్నీ కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికేతప్ప మరేమీకాదు. ముందుముందు మరెన్ని మతోన్మాద ఉపద్రవాలు చూడవలసి వస్తుందో తలచుకుంటేనే భయమేస్తోంది. మంచి, మానవత్వం, శాంతీ, ప్రేమ, సదాచారం, సద్భావన రోజురోజుకూ మంటకలిసి పోతున్నాయి. నిజానికి మంచి, మానవత్వానికి మించిన ధర్మం మరొకటిలేదు. రామరాజ్యం పేరుతో మానవత్వాన్ని మంటగలుపుతూ, తామేదో ధర్మాన్ని ఉధ్ధరిస్తున్నామని అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దేవుని పేరుతో దానవత్వం మానవతకు వ్యతిరేకం. భువిపై మానవ ఉనికి మానవత్వాన్ని కాపాడడానికి, సమాజంలో సామరస్యాన్ని, సద్భావనను పెంపొందించడానికి, న్యాయ స్థాపనకని ధర్మం చెబుతోంది. మానవీయ విలువల కోసం పాటుబడే వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించే దైవం, శాంతీ, సామరస్యాలకు తూట్లు పొడుస్తూ మానవత్వాన్ని ఖూనీ చేసే దుర్మార్గులను ఊరికే వదిలిపెడతాడా?
ఎప్పుడైతే మానవుడు సాటిమనిషి గురించి ఆలోచించడం, అతని యోగక్షేమాలు పట్టించుకోవడం, సత్సంబంధాలు నెరపడం, సద్భావనతో, సామరస్యంతో మసలుకోవడం, సామాజంలో న్యాయ స్థాపనకై ప్రయత్నించడం మానేశాడో అప్పుడే సమాజం పెడద్రోవ పట్టింది. మానవ హృదయంలో అతి పవిత్రంగా ఉండవలసిన మానవత్వానికి తుప్పు పట్టింది. హృదిలో స్వార్ధం పురుడు పోసుకొని ఉన్మాద లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి. తత్ఫలితంగా పరివార్ సృష్టించిన అనేకమంది వీరరాఘవ రెడ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి ఉన్మాద మూకల వెనుక ఉన్నశక్తుల రహస్యాన్ని ఛేదించ వలసిన అవసరం ఉంది. ‘రామరాజ్యం’ అర్ధం కూడా తెలియని రాక్షసమూక దేశంపై పడి అరాచకాలకు తెరలేపింది. ప్రశాంత చిత్తంతో, భక్తిభావంతో పలకవలసిన ‘జైశ్రీరామ్ ‘ అనే పవిత్ర నామం సాటి మనిషిని చంపే యుధ్ధ నినాదంగా మారిపోయింది. సమాజంలో అలజడి చెలరేగింది. అనేక అవలక్షణాలు చోటుచేసుకున్నాయి. శాంతి భద్రతలు కరువై పొయ్యాయి. న్యాయం ప్రియమైపోయింది. కులతత్వం పెచ్చరిల్లింది. మతోన్మాదం పడగవిప్పింది. తీవ్రవాదం, ఉగ్రవాదం జూలువిదిల్చాయి. మతం, మానవతావాదం మంటగలిశాయి. శాంతి, సామరస్యం, సదాచారం, సహజీవనం, సద్భావన, ప్రేమ, మానవీయతలకు విఘాతం కలిగింది. నిజానికి మత విశ్వాసమనేది మానవులు శాంతియుతంగా, సామరస్యంతో, సోదరభావంతో, సద్భావనతో సహజీవనం చేయడానికి దోహదపడాలి. మనుషులమధ్య విద్వేషాలు సృష్టించడానికి అది సాధనం కాకూడదు. భిన్నత్వంలో ఏకత్వం గల మనదేశంలో సర్వమానవ సహిష్ణుతాభావం, పరస్పర సదవగాహన, సద్భావన జన సామాన్యంలో అంతర్వాహినిలా ప్రవహించాలి. శాంతి, ప్రేమ, సహనం, సంయమనం, సహజీవనం లాంటి సుగుణాలు జనించాలి. కులాలు మతాలు వేరైనా మానవత రిత్యా మనదంతా పరస్పరం రక్త సంబంధమన్న పచ్చినిజాన్ని గుర్తించాలి. ఒకరినొకరు, ఒకరి మతాన్నొకరు గౌరవించుకుంటే మనుషులమధ్య, మనసుల మధ్య దూరాలు, వైరాలు తగ్గి మతసామరస్యం వెల్లివిరుస్తుంది. శాంతి, ప్రేమ, సామరస్యం, సద్భావన, మానవీయత పరిఢవిల్లుతాయి. సామాజికన్యాయం విరాజిల్లుతుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆవిష్కృతమవుతుంది. సంఘ శ్రేయోభిలాషులు, ఆధ్యాత్మిక పెద్దలు, సామాజిక కార్యకర్తలు, మంచిని, శాంతిని, మానవతను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి, కలిసి కృషి చేస్తే, ఇలాంటి మతోన్మాదులను కట్టడి చేయడం, సమాజంలో శాంతీ సామరస్యాలను, సోదరభావాన్ని, సద్భావనను పెంపొందించుకోవడం, మానవతను కాపాడుకోవడం, అసంభవం ఏమీకాదు. ఇది ఈనాటి అవసరం.
– యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్ట్