వాషింగ్టన్/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపకుండా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ట్రంప్ తప్పు బట్టారు. కాస్త భూమితో పోయేదానిని యుద్ధం వరకు తెచ్చారని ఉక్రెయిన్‌పై మండిపడ్డారు.
ఇప్పుడు ఉక్రెయిన్ ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని మంగళవారం ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో ట్రంప్ విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ఆ దేశాన్ని ప్రశ్నించారు.
కాగా, అమెరికా అధ్యక్షుడి విమర్శలను ఉక్రెయిన్ ఖండించింది. ట్రంప్ రష్యా తప్పుడు సమాచార వ్యూహంలో చిక్కుకున్నారని అన్నారు. తన దేశాన్ని ఎవరూ బలవంతంగా లొంగిపోనివ్వలేరని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అన్నారు. “మేము మా ఉనికి హక్కును కాపాడుకుంటాము” అని సిబిహా Xలో పోస్ట్ చేశారు.
కాగా, జెలెన్స్కీ ఐదేళ్ల పదవీకాలం 2024 లో ముగియాల్సి ఉంది, కానీ రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ ఫిబ్రవరి 2022 లో మార్షల్ లా విధించింది. దీంతో ఆ దేశంలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించలేదు.
బుధవారం కీవ్‌లో ట్రంప్ దూత కీత్ కెల్లాగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిసారు. ఉక్రెయిన్ “రష్యాతో యుద్దాన్ని ప్రారంభించి ఉండకూడదని ట్రంప్ చెప్పిన ఒక రోజు తర్వాత, అమెరికా అధినేత ట్రంప్ బృందం ఉక్రెయిన్ గురించి “మరింత నిజం” తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
మరోవంక జెలెన్స్కీకి ప్రజామద్దతు 4 శాతమే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఖండించారు. రష్యా చేస్తున్న దుష్ప్రచారంలో ట్రంప్ జీవిస్తున్నారని కీవ్‌లో విలేకరులతో అన్నారు.
“ఈ గణాంకాలు అమెరికా, రష్యా మధ్య చర్చిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. అంటే, అధ్యక్షుడు ట్రంప్… దురదృష్టవశాత్తు ఈ తప్పుడు సమాచారం ఉన్న ప్రదేశంలో నివసిస్తున్నారు,” అని జెలెన్స్కీ ఉక్రేనియన్ టీవీకి చెప్పారు.
ఫిబ్రవరి ప్రారంభంలో కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన తాజా పోల్ ప్రకారం, 57 శాతం మంది ఉక్రేనియన్లు జెలెన్స్కీని విశ్వసిస్తున్నారని చెప్పారు.
మొత్తంగా ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన నెల రోజుల్లోపే ప్లేటు ఫిరాయించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి పూర్తిగా మారుతుందనడానికి ట్రంప్ వ్యాఖ్యలే సాక్ష్యం. ఇంతకాలం యుద్ధానికి రష్యానే కారణమని ఆరోపిస్తూ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది.