హైదరాబాద్: సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కల్పించారు. సైబర్ మోసాల కారణంగా కోల్పోయిన రూ.62,46,900 లక్షల విలువైన డబ్బును తిరిగి చెల్లించే వీలు కల్పించారు. మొత్తం 16 కేసులకు గాను ఎనిమిది స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాలు, ఆరు ఫెడెక్స్, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒక రుణ మోసం కేసు, మరొకటి ఇంప్రెశన్ ప్రాడ్ కేసు ఉన్నాయి.
ఈ మేరకు బాధితులుందరికీ మోసపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వారి సంబంధిత బ్యాంకులను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసానికి గురైన బాధితులకు వారి బ్యాంకుల ద్వారా రూ.12,16,773 తిరిగి చెల్లించారు. ఫెడెక్స్/డిజిటల్ అరెస్ట్, మనీలాండరింగ్ నెపంతో మోసపోయిన ఆరుగురు బాధితులకు రూ.47,85,759 తిరిగి చెల్లించారు. అలాగే రుణం తీసుకునే నిమిత్తం మోసపోయిన రూ.1,24,334 తిరిగి పొందగా, నకిలీ కంపెనీ ద్వారా మోసపోయిన వ్యక్తి రూ.1,20,221 అందుకున్నాడు.
సైబర్ నేరాలకు గురైన ఎవరైనా వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా, సైబర్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి, తద్వారా వారు కోల్పోయిన మొత్తంలో కనీసం కొంత భాగాన్ని తిరిగి పొందవచ్చు అని సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలు లేదా చట్ట అమలు అధికారుల వలె నటించే వ్యక్తుల నుండి మోసపూరిత కాల్‌లకు వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ పోలీసులు సలహా హెచ్చరిక జారీ చేశారు. ‘డిజిటల్ అరెస్టులు’ ఉండవని మరియు స్కైప్ కాల్స్ ద్వారా ఏ అధికారి డబ్బు డిమాండ్ చేయరని వారు నొక్కి చెప్పారు.
టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లోని అధిక-రాబడి, తక్కువ-రిస్క్ పెట్టుబడి సమూహాలకు వ్యతిరేకంగా కూడా వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు, పెట్టుబడి పెట్టే ముందు సెబీ-రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించమని ప్రజలను కోరుతున్నారు.