భువనేశ్వర్: నగరంలోని కిట్ డీమ్డ్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, ఆత్మహత్య, తదనంతరం పొరుగు దేశ విద్యార్థులపై దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వ్యవస్థాపకుడు అచ్యుత సామంత గ నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. క్యాంపస్‌ను ఖాళీ చేసిన వారందరూ తిరిగి రావాలని కోరాడు.
ఈ సంఘటనపై సామంత చేసిన మొదటి బహిరంగ ప్రకటన వీడియోను KIIT X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, ఈ విషయాన్ని పరిశీలిస్తున్న ఒడిశా ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం తన ముందు హాజరు కావాలని సమంతకు సమన్లు పంపిన కొన్ని గంటల ముందు ఈ వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.
విద్యార్థులు, ఇద్దరు నేపాల్ ఎంబసీ అధికారుల సమావేశంలో కూర్చున్న సామంత, “ఫిబ్రవరి 16 రాత్రి జరిగిన దురదృష్టకర సంఘటనపై మేమందరం చాలా చింతిస్తున్నాము. విచారంగా ఉన్నాము. నేను కూడా వ్యక్తిగతంగా బాధ పడుతున్నానని, కొంతమందిపై మేము చర్యలు తీసుకున్నాము” అని ఆయన Xలో పోస్ట్ చేశారు.
“మీ విశ్వవిద్యాలయం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా నడుస్తోంది. విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. మేమందరం సంతోషంగా ఉన్నాము. KIITలో ఉన్న నేపాల్ విద్యార్థుల్లో కొంతమంది తరగతులకు హాజరవుతున్నారు. కాబట్టి, నేపాల్ నుండి వచ్చిన KIIT విద్యార్థులందరూ దయచేసి మీ స్వంత విశ్వవిద్యాలయంలో చేరి తరగతులకు హాజరు కావాలని నేను వినయంగా సలహా ఇస్తున్నానని సామంత అన్నారు.
అంతేకాదు, “విద్యాపరమైన విషయాలకు, క్యాంపస్ ప్లేస్‌మెంట్ లేదా క్రమశిక్షణకు సంబంధించి ఎటువంటి హాని జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను. KIITలో చదువుతున్న నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రుల ముందు నేను క్షమాపణలు కోరుతున్నాను. నా ప్రియమైన KIIT విద్యార్థులు దయచేసి త్వరలో తిరిగి రండి, మేమందరం మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాము,” అని అచ్యుత సామంత అన్నారు.
మరోవంక, ఒడిశా ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ, సామంతకు రాసిన లేఖలో, “ఆఫీస్ ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా రిఫరెన్స్ వ్యవధిపై కమిటీ ముందు తగిన డాక్యుమెంటరీ ఆధారాలతో సాక్ష్యాలను సమర్పించడానికి 21.02.2025న సాయంత్రం 6.30 గంటలకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉన్నత స్థాయి కమిటీ ముందు హాజరు కావాలని మిమ్మల్ని అభ్యర్థించారు” అని పేర్కొంది.
ఉన్నత విద్యా శాఖ, మహిళా – శిశు అభివృద్ధి (WCD) కార్యదర్శులతో కూడిన కమిటీ బుధవారం KIIT క్యాంపస్‌ను సందర్శించి, కొంతమంది నేపాలీలతో చర్చలు జరిపింది. క్యాంపస్‌లో ప్రదర్శన నిర్వహించినందుకు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది చట్టాన్ని చేతులోకి తీసుకున్నారని విద్యార్థులు ఆరోపించారు.
కాగా, ఈ అంశంపై ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ మాట్లాడుతూ, “ఈ విషయంపై విచారణ కోసం ఎవరినైనా పిలిపించే అధికారం ఉన్నత స్థాయి కమిటీకి ఉంది. కమిటీ చట్టం ఆధారంగా పనిచేస్తోంది” “రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ రాయబార కార్యాలయ అధికారులతో కూడా చర్చించి, పరిణామాల గురించి విద్యార్థులకు తెలియజేసింది” అని ఆయన అన్నారు.
ఆదివారం మధ్యాహ్నం నేపాల్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ప్రకృతి లామ్సల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో KIITలో అశాంతి మొదలైంది. ఇతర నేపాల్ విద్యార్థులు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, KIIT అధికారులు సుమారు 1,000 మంది నేపాల్ విద్యార్థులకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసి, వారిని క్యాంపస్ వదిలి వెళ్లాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంపై అరెస్టు చేసిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు మూడు రోజుల రిమాండ్‌కు పంపినట్లు పోలీసు కమిషనర్ ఎస్ దేవ్ దత్తా సింగ్ తెలిపారు. మహిళ మరణించిన కొన్ని గంటల తర్వాత.. నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు నిందితుడిని ఇక్కడి బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరణించిన నేపాల్ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేయడం, దుర్భాషలాడడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న తరువాత, KIIT అధికారులు క్షమాపణలు చెప్పి, నేపాల్ విద్యార్థులను క్యాంపస్‌కు తిరిగి రావాలని అభ్యర్థించారు. నేపాల్ విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల సహాయ కేంద్రాన్ని తెరిచింది.