న్యూఢిల్లీ: భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్ఐఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్ డాలర్ల సాయం చేయాలంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. ఈ మేరకు భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. విదేశీ వ్యవస్థలతో రాహుల్ గాంధీ జతకట్టారని, భారతదేశ వ్యూహాత్మక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు విదేశీ శక్తుల చేతుల్లో పావుగా మారారని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఆరోపించారు. తాను మరోసారి అధికారంలోకి రాకుండా విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని 2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలను ట్రంప్ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. 2023 మార్చిలో రాహుల్ గాంధీ లండన్ వెళ్లి భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా, ఐరోపాలోని విదేశీ శక్తులను కోరారని ఆరోపించారు.
కాగా, భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు ‘యూఎస్ఏఐడీ’ నిధులను వినియోగించారంటూ ట్రంప్ అనడం అర్థం లేని వ్యాఖ్యలే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. 1961లో యూఎస్ఏఐడీని స్థాపించారని, అప్పటినుంచి దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఈ సంస్థ ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.