దుబాయ్:: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. ఐసిసి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ… మరోసారి ఈ మ్యాచ్‌లో విజృంభించాడు, ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆటతీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టపై సునాయస విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే, వరుసగా రెండో ఓటమి తర్వాత ఎనిమిది జట్ల ఈవెంట్ నుండి పాకిస్తాన్ ముందుగానే నిష్క్రమించే అవకాశం ఉంది. అయితే, కివీస్ జట్టు గెలుపోటములపై పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి
ముందుగా టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ నిర్ణయం తప్పని ఇండియా బౌలర్లు నిరూపించారు. పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ మొదటి 9.2 ఓవర్లలో 47 పరుగుల వద్ద అవుటయ్యారు. అందులో 23 పరుగులు చేసిన బాబర్ ఆజం బిగ్ వికెట్ కూడా ఉంది.
భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రన్ రేటు చాలా వరకు తగ్గిపోయింది. పాక్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఇది భారత జట్టుకు లాభించింది. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ, దాని కోసం 144 బంతులు ఆడాల్సి వచ్చింది.
పాకిస్తాన్ ఆరంభంలో కొంచెం మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే, మహ్మద్ రిజ్వాన్ 151 పరుగుల వద్ద ఔటవగానే మిగతా ఎనిమిది వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పడిపోయాయి. ఆ తర్వాత కేవలం 90 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీని కారణంగా పాకిస్తాన్ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది.
242 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ 51వ వన్డే సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ 67 బంతుల్లో 56 పరుగులు, శుభ్‌మాన్ గిల్ 52 బంతుల్లో 46 పరుగులు చేసి ఇంకా ఏడు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
చాలా కాలంగా ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 100 పరుగుల అజేయ సెంచరీతో పాటు భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.