హైదరాబాద్: రాబోయే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా CBSE, ICSE, IB, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగు భాషా పాఠ్యాంశాలను అమలు చేయనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చేసిన ప్రతిపాదనను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఇప్పుడు ప్రభుత్వ ఆమోదం లభించింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి, తొమ్మిదో తరగతి విద్యార్థులు ‘సింగిడి’ (ప్రామాణిక తెలుగు) కు బదులుగా ‘వెన్నెల’ (సరళమైన తెలుగు) నేర్చుకుంటారు, ఈ మార్పు 2026-27 నుండి పదో తరగతి వరకు వర్తించనుంది.
కాగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ (Compulsory Teaching and Learning of Telugu in Schools) చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, గత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల పాఠశాలల్లో తెలుగు బోధనను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. రాష్ట్రంలో గతేడాది అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు అమలుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకువచ్చింది. తదనుగుణంగా యాజమాన్యంతో సమావేశం నిర్వహించి, రాబోయే విద్యా సంవత్సరం నుంచి CBSE, ICSE వంటి ఇతర బోర్డు స్కూళ్లలో కూడా 9, 10 తరగతులకు తెలుగు సబ్జెక్టును బోధించాలనే నిర్ణయాన్ని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది.
కాగా I-X తరగతుల నుండి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలనే నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటారు.