ఇంఫాల్/న్యూఢిల్లీ: అరంబాయి టెంగోల్ (AT) ప్రతినిధి బృందం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి, సరిహద్దు రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ముందుకు సాగే మార్గం గురించి చర్చించిందని ఆ సంస్థ ప్రతినిధి ఇంఫాల్‌లో విలేకరులకు తెలిపారు.
ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు NDTVతో మాట్లాడుతూ…ఆయుధాలు అప్పగించిన తర్వాత పౌరులపై ఎటువంటి దాడులు జరగవని, కేంద్ర దళాలు, పోలీసులు ఏవైనా భద్రతా లోపాలను భర్తీ చేస్తారని, లేకుంటే పౌరులు మళ్లీ ఆయుధాలు చేపట్టాల్సి వస్తుందని అరాంబాయి టెంగోల్ ప్రతినిధి బృందం గవర్నర్ నుండి హామీ కోరిందని తెలిపారు.
రాజ్ భవన్‌లో గంటసేపు జరిగిన సమావేశం తర్వాత, అరంబాయి టెంగోల్ ప్రతినిధి రాబిన్ మాంగాంగ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నల్లమందు సాగును పూర్తిగా నాశనం చేయడం, సరిహద్దుల్లో కంచె వేయడం, 1951ని బేస్ ఇయర్‌గా తీసుకుని జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) ప్రక్రియను నిర్వహించడం, మైతీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ST) కేటగిరీలోకి తీసుకురావడం వంటి డిమాండ్లతో కూడిన మెమోరాండంను సమర్పించామని చెప్పారు.
“అరంబై టెంగోల్‌తో సహా గ్రామ వాలంటీర్లపై ఏ కమిషన్, ట్రిబ్యునల్, కోర్టు మొదలైన వాటి ద్వారా అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు” అని కూడా ఆ మెమోరాండంలో పేర్కొంది.
“రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని తిరిగి తీసుకురావాలని” గవర్నర్‌తో చర్చించామని మాంగాంగ్ అన్నారు. “కొన్ని అంతర్గత పరిస్థితుల” గురించి అరాంబాయి టెంగోల్ తనకు అవగాహన కల్పించిందని, దానిని తాను తరువాత వివరిస్తానని ఆయన అన్నారు. “ఖచ్చితంగా, రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు త్వరలోనే పునరుద్ధరిస్తారని” ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గవర్నర్ నిర్దేశించిన ఏడు రోజుల గడువులోపు ఆయుధాలను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు, ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, “ఆయుధాలకు సంబంధించి మాకు కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. అవి నెరవేరితే, మేము అన్ని ఆయుధాలను అప్పగిస్తాము, ఎటువంటి సమస్య లేదు… మనం మునుపటిలాగే శాంతి, సంయమనంతో జీవించాలి. ప్రతిదీ సాధ్యమే” అని అన్నారు.
“త్వరలో శాంతి నెలకొంటుందని గవర్నర్ ఆశిస్తున్నారు మా సహకారం కోరారు. ఆయుధాలను అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత, రహదారులు తెరుస్తారు. ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చు, తద్వారా శాంతి స్థిరత్వం నెలకొంటాయని మాంగాంగ్ అన్నారు.
లోయలోని ఆధిపత్య మెయిటీ కమ్యూనిటీ, మణిపూర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించే కుకీలు మే 2023 నుండి భూమి హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అనేక సమస్యలపై పోరాడుతున్నాయి. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, ఆయన మంత్రి మండలి ఫిబ్రవరి 9న రాజీనామా చేశారు, ఆ తర్వాత గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సస్పెండ్ చేశారు,
ఆయుధాలు అప్పగించడానికి 7 రోజుల గడువు
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు.
కుక, మెయిటీ పౌర సమాజ సంస్థలు రెండు వైపుల నమ్మకం తీవ్రంగా కోల్పోవడం వల్ల ఏకకాలంలో నిరాయుధీకరణను నిర్ధారించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి . “స్వచ్ఛంద సేవకుల” ముసుగులో కుకి మిలిటెంట్లు పర్వత ప్రాంతాలలోని గ్రామాలపై దాడి చేస్తున్నారని మెయిటీ వర్గం ఆరోపించగా, అరాంబాయి టెంగోల్ (AT) అనేది “రాడికల్ మెయిటీ మిలీషియా” అని, కుకి గ్రామాలపై దాడి చేస్తున్నట్లు కుకి తెగలు ఆరోపించాయి.
మే 2023లో జరిగిన మొదటి ఘర్షణల తర్వాత అరాంబాయి టెంగోల్ (AT) అంతర్-జిల్లా సరిహద్దుల్లోని వారి గ్రామాలపై దాడి చేయడం ప్రారంభించిందని, దీని వలన కుకి తెగలు ఆయుధాలు చేపట్టి గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కుకి పౌర సమాజ సంఘాలు ఆరోపించాయి. పోలీసు ఆయుధశాలలను దోచుకున్న కేసుల్లో అనేక మంది అరాంబాయి టెంగోల్ (AT) సభ్యుల పేర్లు ఉన్నాయి.
అయితే, జాతి హింస ప్రారంభ రోజుల్లో చట్ట అమలులో అసమర్థత కారణంగా “గ్రామ స్వచ్ఛంద సేవకులు”గా ఆయుధాలు చేపట్టవలసి వచ్చిన సాంస్కృతిక సంస్థ ఇది అని అరాంబాయి టెంగోల్ (AT) చెబుతోంది; చట్టం సరిగా అమలు చేయపోవడం వల్లే కుకి తీవ్రవాదులు పర్వత ప్రాంతాలలోని మెయిటీ గ్రామాలపై దాడులకు పాల్పడ్డారని అది పేర్కొంది.
కాగా, 2023 మేలో చోటుచేసుకున్న మణిపూర్ హింసలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50,000 మంది నిరాశ్రయులయ్యారు.