హైదరాబాద్: భారత పార్లమెంటులో ఎంపీల సంఖ్యను పెంచే లక్ష్యంతో చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియకు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ అంశం కారణంగా దక్షిణాది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను తోసిపుచ్చింది.
కాగా డీలిమిటేషన్ అంశంపై ఫిబ్రవరి 23 న కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ… పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో దక్షిణాదిలోని ఏ రాష్ట్రం ఒక్క లోక్‌సభ స్థానాన్ని సైతం కోల్పోయే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా దక్షిణాదిలో లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
కాగా, డీలిమిటేషన్ ప్రక్రియ అమలైతే…తమిళనాడు ఎనిమిది లోక్‌సభ స్థానాలను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించిన తర్వాత అమిత్ షానుండి ఈ ప్రతిస్పందన వచ్చింది. ఈ అంశంపై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.
అసలు ఏమిటీ డీలిమిటేషన్…
ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది ప్రజాప్రతినిదులు ఉండాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు డీ లిమిటేషన్ అమల్లోకి వచ్చింది
భారత రాజ్యాంగం ఏమి చెబుతుంది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం, ప్రతీ జనాభా లెక్కల తర్వాత, నియోజకవర్గాల సంఖ్య, వాటి సరిహద్దులను సర్దుబాటు చేస్తారు. తాజా జనాభా లెక్కల డేటా ఆధారంగా, పార్లమెంట్ చట్టం ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు.
ఆర్టికల్ 170 – ఇది రాష్ట్ర శాసనసభల డీలిమిటేషన్‌ను నియంత్రిస్తుంది, జనాభా ఆధారంగా ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది.
డిలిమిటేషన్ ప్రక్రియ జన గణన ఆధారంగా జరుగుతుంది, దీనిని పార్లమెంటు డీలిమిటేషన్ చట్టం కింద ఏర్పాటు చేసిన కమిషన్ నిర్వహిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఇందుకు కనీసం ఐదేళ్ల సమయం పట్టే అవకాశముంది. దీన్ని గెజిట్ లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటినీ పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంటు కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏది చెబితే అది చట్టం అవుతుందంతే.
దేశంలో 1952 నాటికి 494 పార్లమెంటు స్థానాలు ఉండేవి 1962లో 522 పార్లమెంటు స్థానాలు, 3,771 అసెంబ్లీ స్థానాలకు పెరిగాయి. 1972లో 543 పార్లమెంటు స్థానాలు 3,997 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే 2002లో పార్లమెంటు స్థానాల(543) సంఖ్య మారలేదు కానీ , అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 చేరింది. ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య మారుతుంటుంది.
దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
కోవిడ్ మహమ్మారి కారణంగా 2021 జనాభా లెక్కలు ఆలస్యమయ్యాయి. 2026 సమివస్తున్న తరుణంలో డీలిమిటేషన్ కసరత్తు మొదలైంది. అయితే, జనాభా ఉత్తరాదిన పెరగడం, దక్షిణాదిన తగ్గడం చూస్తే, తమ సీట్లు తగ్గుతాయని తమిళనాడు వంటి రాష్ట్రాలు భయపడుతున్నాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే, డీలిమిటేషన్ కసరత్తు మొత్తం పార్లమెంటరీ సీట్లను మార్చకుండానే నియోజకవర్గాలను పెంచవచ్చు, తగ్గించవచ్చు లేదా మార్చవచ్చు. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల అనుమానాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన స్థానాలు పెరిగి, దక్షిణాదిన తమ సీట్ల సంఖ్యను తగ్గిస్తారేమో అని భయపడుతున్నాయి.
ఇటీవల తమిళనాడు సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ, డీలిమిటేషన్ తమిళనాడును ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. బీహార్‌ను ఉదాహరణగా తీసుకుని ఆయన మాట్లాడారు, ప్రస్తుతం అక్కడ 40 మంది ఎంపీలు ఉన్నారు, తమిళనాడులో 39 మంది ఉన్నారు. రెండు రాష్ట్రాల జనాభాను పోల్చినప్పుడు, బీహార్‌లో జనాభా గణనీయంగా ఎక్కువగా ఉంది. స్టాలిన్ ప్రకారం, బీహార్ జనాభా తమిళనాడు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెరిగింది; అందువల్ల, బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్య సహజంగానే పెరుగుతుంది.
జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ మొత్తం దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందనే స్టాలిన్ వైఖరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించరాదని వాదించారు. తన మద్దతును తెలియజేస్తూ, స్టాలిన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ఈ విషయంలో ఆయనకు గట్టిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశానికి అత్యంత అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దు” అని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది అతిపెద్ద వాటాదారు. భారతదేశ జిడిపిలో పంతొమ్మిది శాతం జనాభా దాదాపు 35 శాతం వాటాను అందిస్తోంది” అని ఆయన అన్నారు.
2026లో లోక్‌సభ ఎలా ఉంటుంది
కొత్త పార్లమెంటులో 888 మంది ఎంపీలు కూర్చునే వీలుంది. 2026 జనాభా లెక్కల తర్వాత “ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఫర్ రిప్రజెంటేషన్” అనే పరిశోధనా పత్రం ప్రకారం, రాజకీయ అధికారంలో గణనీయమైన మార్పులు ఉంటాయి. ఏ రాష్ట్రమూ ప్రాతినిధ్యం కోల్పోకూడదనుకుంటే, లోక్‌సభలో 848 మంది ఎంపీలు ఉండాలి. దీనిని అనుసరిస్తే, ఉత్తరప్రదేశ్‌లో 143 సీట్లు, బీహార్‌లో 79 (ప్రస్తుతం 49), తమిళనాడులో 49 (ప్రస్తుతం 39) ఉండగా, కేరళలో 20 సీట్లు మారవు.
స్టాలిన్ అంచనా వేసినట్లుగా, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతినిధుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ, BIMARU రాష్ట్రాలలో ఎంపీల సంఖ్య మెరుగుపడుతుంది; అంటే; BJP పాలిత రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి.