న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై తృణమూల్ కాంగ్రెస్ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో అమెరికా నుండి బహిష్కృతులైన భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించిన విషయాన్ని వెల్లడించడంలో విదేశాంగ మంత్రి విఫలమయ్యారని ఆరోపిస్తూ టీఎంసీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సాగరిక ఘోష్ ఫిబ్రవరి 20న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ఒక లేఖను సమర్పించారు, మంత్రిపై రాజ్యసభ విధాన నియమాలు, ప్రవర్తనా నియమాలలోని సంబంధిత నిబంధనలను ప్రయోగించాలని కోరారు.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 6న రాజ్యసభలో జైశంకర్ చేసిన ప్రకటనను ఆమె ఉదహరించారు. అమెరికా నుంచి “తిరిగి వస్తున్న బహిష్కృతులపై విమానంలో హక్కుల దుర్వినియోగం జరగకుండా చూసుకోవడానికి అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పార్లమెంటులో ఇచ్చిన హామీలను విదేశాంగమంత్రి పాటించలేదని టీఎంసీ ఎంపీ అన్నారు.
ఫిబ్రవరి 5న అమృత్‌సర్‌లో బహిష్కృతులతో మొదటి విమానం దిగిన తర్వాత జైశంకర్ ప్రకటన వచ్చింది. బహిష్కృతులను చేతికి సంకెళ్లు వేయడంపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 15న రెండవ విమానంలో బహిష్కృతులు మంత్రి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా “మళ్లీ చేతులకు సంకెళ్లతోనే వచ్చారని సాగరికా ఘోష్ పేర్కొన్నారు.
బహిష్కృతులపై “భౌతిక నిర్బంధాలు, అమానవీయ ప్రవర్తన” “నిర్బంధ కేంద్రాలలో హింసను” ఎదుర్కొన్నారని, వీసా మోసాన్ని తనిఖీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు. బహిష్కృతుల నుండి వచ్చిన సాక్ష్యాలను ఉటంకిస్తూ, ప్రయాణంలో వారికి సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసుతో బంధించారని, ఒక వ్యక్తి తన తలపాగాను తొలగించవలసి వచ్చిందని ఆమె చెప్పారు. వారిని హింసించారు, హక్కులను హరించారు. సరైన ఆహారం నిరాకరించారని ఆమె అన్నారు.
“మంత్రి ప్రకటనకు, బహిష్కృతులైన వారి ప్రత్యక్ష వివరాలకు మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసాల దృష్ట్యా, ఈ విషయాన్ని ప్రివిలేజెస్ కమిటీకి నివేదించాలని నేను అభ్యర్థిస్తున్నాను. అక్రమ వలసదారులపై జరిగిన హక్కుల దుర్వినియోగాన్ని వెల్లడించడంలో మంత్రి విఫలమవడం ద్వారా సభను తప్పుదారి పట్టించారా లేదా అని కమిటీ పరిశీలించాలి” అని ఆమె రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసింది.
“ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనలు ప్రాథమికంగా కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, అవి సభను తప్పుదారి పట్టిస్తున్నాయని నేను చెప్పనవసరం లేదు, ఆ ప్రకటనలు సిగ్గుచేటు” అని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ అన్నారు.