ఇంఫాల్: మణిపూర్‌లో రెండేళ్లక్రితం ఆయుధశాల నుండి దోచుకున్న 4,000 ఆయుధాలు ఇప్పటికీ డిపాజిట్ చేయకపోవడంతో, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గడువును మరో వారం అంటే మార్చి 6వరకు పొడిగించారు. అంతేకాదు కొండ, లోయ ప్రాంతాల ప్రజలు అదనపు సమయం కావాలని డిమాండ్ చేయడంతో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా శుక్రవారం దోచుకున్న మరియు అక్రమ ఆయుధాలను అప్పగించడానికి మార్చి 6 సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించారని అధికారిక ప్రకటన తెలిపింది.
“స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించడానికి ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత, లోయ, కొండ ప్రాంతాల నుండి ఈ వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి. నేను ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని మార్చి 6న సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించాలని నిర్ణయించుకున్నాను” అని గవర్నర్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వ్యవధిలోపు ఆయుధాలను అప్పగించే వారిపై ఎటువంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోబోమని ఆ ప్రకటన హామీ ఇచ్చింది, “శాంతి, మత సామరస్యం, యువత భవిష్యత్తు, సమాజ భద్రతకు దోహదపడటానికి సంబంధిత ప్రతి ఒక్కరికీ ఇదే చివరి అవకాశం” అని నొక్కి చెప్పింది.
భద్రతా దళాల నుండి దోచుకున్న ఆయుధాలను, ఇతర చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలను ఏడు రోజుల్లోగా స్వచ్ఛందంగా అప్పగించాలని ఫిబ్రవరి 20న గవర్నర్ అజయ్ భల్లా కోరారు, ఆ గడువు గురువారంతో ముగిసింది. ఈ ఏడు రోజుల కాలంలో, ప్రధానంగా లోయ జిల్లాల్లో 300 కంటే ఎక్కువ ఆయుధాలను ప్రజలు అప్పగించారు. గడువు తర్వాత పోలీసులు , భద్రతా దళాలు విస్తృతమైన కార్యకలాపాలను చేపడతాయి” అని ప్రకటన పేర్కొంది.
మే 2023లో మెయిటీ ఆధిపత్య లోయలో, మెయిటీ, కుకీ వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పుడు, పోలీసు శిబిరాల నుండి 6,000 కంటే ఎక్కువ అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి దోపిడీకి గురయ్యాయి.
గవర్నర్ విజ్ఞప్తి తర్వాత కొన్ని ఆయుధాలను లోయలో, కొండలలో జమ చేసినప్పటికీ, గవర్నర్ భల్లా విజ్ఞప్తి మేరకు మెయితీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తానని “హామీ” ఇచ్చినందుకు ప్రతిస్పందనగా, మెయితీ రాడికల్ గ్రూప్ అయిన అరంబై టెంగోల్ సభ్యులు గురువారం 246 ఆయుధాలను జమ చేశారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం తొలి ప్రాధాన్యత అని గవర్నర్ ఇంతకు ముందు అన్నారు.
మే 2023 నుండి మైతీ, కుకి-జో సమూహాల మధ్య జరిగిన జాతి హింసలో 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.