గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా మంత్రి జగదీష్ విక్రమ చేసిన ప్రకటనను గట్టిగా వ్యతిరేకించడంతో తీవ్ర వాగ్యుద్ధానికి దారితీసింది. “మత స్థలాల చుట్టూ ఉన్న ఆక్రమణలలో ఎక్కువ భాగం ఒక నిర్దిష్ట సమాజం ద్వారానే జరిగింది” అని విక్రమా పేర్కొనడంతో వివాదం ప్రారంభమైంది.
దీనిపై గుజరాత్‌లోని ఏకైక ముస్లిం ఎమ్మెల్యే ఖేడావాలా తీవ్రంగా స్పందించారు. బిజెపి నాయకులు మతపరమైన గుర్తింపు కారణంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. “నేను గుజరాత్‌లో ఏకైక ముస్లిం ఎమ్మెల్యేని, అందుకే నన్ను ఒంటరిగా చూస్తున్నారు” అని ఆయన నొక్కిచెప్పారు, ముస్లిం సమాజం అప్రమత్తంగా ఉండాలని… అసెంబ్లీ లోపల,వెలుపల వారి సమస్యలకు మద్దతు ఇవ్వగల నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
జమాల్పూర్-ఖాడియా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేడావాలా తన విజయం మత రాజకీయాల ద్వారా రాలేదని నొక్కి చెప్పారు. తన నియోజకవర్గంలో 60% ముస్లింలు, 40% హిందువులు ఉన్నారని, వారి విశ్వాసంతో సంబంధం లేకుండా తాను అన్ని ప్రాంతాలకు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆయన గుర్తు చేసారు. మతపరమైన ప్రాతిపదికన కాకుండా తన నియోజకవర్గంలోని అందరికీ సేవ చేయగల సామర్థ్యం కారణంగా తాను గెలిచానని ఆయన చెప్పారు.
ఖేదవాలా మత రాజకీయాల్లో పాల్గొంటున్నారనే బీజేపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు. భారతదేశ లౌకిక విలువలకు తాను కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు. “ఇది మన దేశం, మేము ఈ నేలపై జీవిస్తాము. ఇక్కడే చనిపోతాము” అని ఆయన ప్రకటించారు, తనను మతపరమైన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, దేశ ఐక్యత, లౌకికవాదం పట్ల తన నిబద్ధతను బలంగా చాటిచెప్పారు.