జెరూసలేం: పాలస్తీనియన్లు గాజాను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు, ఈ సందర్భంగా గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని, ఈ ప్రక్రియలో గాజా జనాభాకు పునరావాసం కల్పించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను, ఆయన వినూత్న ప్రణాళికను ప్రశంసించారు.
కాగా, యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకొని… అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడి ప్రజలకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పిస్తామని ట్రంప్ అన్న మాటలను నేను నమ్ముతున్నాను” అని నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగిస్తూ అన్నారు.
ఇదిలా ఉండగా, గాజాకు ఆహారం, ఇతర సరకులు సరఫరా చేసే వాహనాలను ఇజ్రాయెల్ అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. టెల్అవీవ్కు అండగా ఉంటామని అగ్రరాజ్యం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్ హ్యూజ్ తెలిపారు.
నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనపై మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే ఈ కొత్త ప్రతిపాదన ట్రంప్ యంత్రాంగం నుంచే వచ్చిందని ఇజ్రాయెల్ చెబుతోంది. దీని ప్రకారం.. హమాస్ తన దగ్గర ఉన్న సగం మంది బందీలను విడిచిపెట్టాలి. ఇందుకు హమాస్ ససేమిరా అంటోంది. జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెబుతోంది.
కాగా, గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెల్ అవీవ్ ఆకలిని ఆయుధంగా వాడుకుంటోందని ఈజిప్టుతో పాటు.. ఖతార్ కూడా ఆక్షేపించింది. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇజ్రాయెల్ వైఖరిని తప్పుబడుతున్నాయి.