హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడంతో గత 11 రోజులుగా పనిచేయని కన్వేయర్ బెల్ట్ మరమ్మతు పూర్తయింది. దీనితో, ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్న సొరంగంలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.
గత పదకొండు రోజులనుంచి మట్టి తరలింపు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. లోకో ట్రైన్ ద్వారా టిప్పర్ మట్టిని కూడా బయటకు తేలేకపోతున్నామని సహాయక బృందాలు ఆదివారం టన్నెల్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కన్వేయర్ బెల్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించడంతో పనులు చకచకా జరిగిపోయాయి.
టన్నెల్‌లో 5 వేల టన్నుల మట్టి ఉందని అంచనా వేస్తుండగా బుధవారం నుంచి బెల్టు ద్వారా రోజుకు 800 టన్నుల మట్టిని బయటకు తేగలుగుతామని సహాయక బృందాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పుడు రెస్క్యూ సిబ్బందికి చెత్త,శిధిలాలను తరలించడం సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.
మరోవంక మెటల్ కటింగ్ నిపుణులతో కూడిన సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) బృందం సొరంగం లోపల దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) ప్లాట్‌ఫామ్‌ను కత్తిరించిందని SCR అధికారి తెలిపారు.
ఫిబ్రవరి 22న, నాగర్ కర్నూల్‌లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం పైభాగం కూలిపోవడంతో, ఇద్దరు ఇంజనీర్లు సహా ఎనిమిది మంది కార్మికులు శిథిలాలు, బురదలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారిని మనోజ్ కుమార్ (UP), శ్రీ నివాస్ (UP), సన్నీ సింగ్ (J&K), గురుప్రీత్ సింగ్ (పంజాబ్) మరియు సందీప్ సాహు, జెగ్తా జెస్, సంతోష్ సాహు, అనుజ్ సాహుగా గుర్తించారు, వీరందరూ జార్ఖండ్‌కు చెందినవారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో నిలిచిపోయిన కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ తరువాత డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డిజి నాగిరెడ్డి, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఆలీ, జిల్లా ఎస్‌పి వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్‌డిఆర్‌ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, ప్రతినిధులు పాల్గొన్నారు.
రెస్క్యూ చర్యలను వేగవంతం చేయడం, టీమ్‌ల మధ్య సమన్వయం పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేశారు. నీటిని ఎప్పటికప్పుడూ పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నారు. మరోవంక ఢిల్లీ నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సహాయంతో టన్నెల్ సహాయక చర్యలు వేగవంతం చేశారు.