ఉత్తరప్రదేశ్ : పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనలతో పాటు వచ్చే హోలీ పండుగకు ముందు సంభాల్ పోలీస్ అధికా అనుజ్ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. సంభాల్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అనుజ్ చౌదరి గురువారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…హోలీ రంగులు మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఆరోజు ఇంట్లోనే ఉండాలని సూచించారు, హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు సంవత్సరానికి 52 సార్లు వస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అనుజ్ చౌదరి మాట్లాడిన వీడీయోలింక్
ప్రజలు “విస్తృత మనస్తత్వం” కలిగి ఉండాలని, హోలీ పండుగ కలిసి జరుపుకోవాలని ఆయన చేసిన ప్రకటనను, ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపించారు.
ఒకే రోజు వచ్చిన రెండు వేడుకలు సజావుగా జరిగేలా చూసేందుకు సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో చౌదరి వ్యాఖ్యలు చేశారు. మత సామరస్యం, ప్రాముఖ్యతను మరియు శాంతిభద్రతలను కాపాడుకోవడానికి కఠినమైన నిఘా అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
రెండు వర్గాల వారు ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకోవాలని, పాల్గొనడానికి ఇష్టపడని వారిపై బలవంతంగా రంగులు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హోలీ, ఈద్ వేడుకల మధ్య పోలికను చూపించిన అధికారి, ముస్లింలు ఈద్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లే, హిందువులు హోలీ కోసం ఎదురు చూస్తున్నారని, రెండు పండుగలు కలిసి రావడం పరస్పర గౌరవాన్ని నొక్కి చెబుతాయని పేర్కొన్నారు.
అయితే, ప్రతిపక్ష నాయకులు చౌదరి ప్రకటనను వెంటనే ఖండించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ ఆ అధికారిని విమర్శించారు, ఆయన బిజెపి మద్దతుదారుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పక్షపాతం చూపినందుకు ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు పొందేందుకు వీలుగా… అధికార పార్టీ తొత్తులుగా ఉండేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ వైస్ చైర్మన్ మనీష్ హింద్వి ఈ ప్రకటనను రాజకీయంగా అభివర్ణించారు, అధికారులు తటస్థంగా, లౌకికంగా ఉండాలని వాదించారు. పోలీసు అధికారి వ్యాఖ్యలు విభజనకు దారితీస్తాయని,ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
మతంతో సంబంధం లేకుండా అందరికీ శాంతి, భద్రతను అందించడం అధికారి విధి అని కూడా హింద్వి గుర్తు చేశారు. హోలీ, జుమా నమాజ్ రెండింటినీ శాంతియుతంగా జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
గత నవంబర్‌లో సంభాల్‌లో జరిగిన హింస తర్వాత పోలీసు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పోలీసు అధికారి చేసిన ప్రస్తుత వ్యాఖ్యలు సున్నితమైన సమయాల్లో తటస్థతను కాపాడుకోవడంలో, శాంతిని నెలకొల్పడంలో చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థల తీరుపై మరోసారి చర్చకు దారితీసింది.