హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ముసాయిదా బిల్లుకు న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ నుండి వచ్చిన మధ్యంతర నివేదికను క్యాబినెట్ సమీక్షించింది. వివిధ వర్గాల నుండి 71 పిటిషన్లను పరిశీలించిన తర్వాత కమిషన్ మార్చి 2న తన రెండవ నివేదికను సమర్పించింది. ఫిబ్రవరి 3న సమర్పించిన మొదటి నివేదికను మార్పులు లేకుండా ఆమోదించారు.
కాగా, కేబినెట్ సమావేశంలో కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తేదీల ఖరారు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతారు.
తెలంగాణలో 59 ఎస్సీ కులాలు..
రాష్ట్రంలో మాల, మాదిగ సహా మొత్తం 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 15 శాతం వరకు రిజర్వేషన్ ఉంది. అంటే 100లో 15 శాతం ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు. అయితే ఎస్సీ జాబితాలోని కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ముందు ఉన్నాయి. మరికొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కుల సంఘాలు చెబుతూ వచ్చాయి. దీంతో ఎస్సీ రిజర్వేషన్లను కొన్ని కులాలు మాత్రమే ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాయని, మిగతా కులాల వారు వెనుకబడే ఉంటున్నారన్న వాస్తవాలు వెల్లడయ్యాయి. దీంతో ఎస్పీ వర్గీకరణకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఓకే అంది. అయితే మాలలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు.