న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండవ దశలోనూ వాడీ, వేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఓటర్ల కార్డులకు ‘EPIC’ నంబర్ కేటాయింపు, సరిహద్దుల విభజన, త్రిభాషా అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టనున్నాయి. మరోవంక వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఆమోదింప జేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.
ఏప్రిల్ 4వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భారత అక్రమ వలసదారుల బహిష్కరణ విషయంలో అమెరికా అవలంభించిన విధానం, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధిస్తానని ప్రకటించడం వంటి అంశాలను ప్రతిపక్షాలు ఆస్త్రంగా ఉపయోగించబోతున్నాయి.
బడ్జెట్ సమావేశాల మొదటి దశ చివరి రోజున ప్రతిపక్షాల నిరసనల మధ్య ఫిబ్రవరి 13న జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత, వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ఆమోదించడంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టబోతోంది. ఈ బిల్లుతో పాటు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు- 2025 ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
స్వల్పకాలిక చర్చల కోసం డిమాండ్ చేయడం, సభా దృష్టిని ఆకర్షించే తీర్మానాలు , జీరో అవర్‌వంటి వివిధ పార్లమెంటరీ సాధనాలను ఉపయోగించి పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్ష పార్టీలు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటున్నాయని వర్గాలు తెలిపాయి.
ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులు (EPICలు) నంబర్లపై ఎన్నికల సంఘం చేసిన వివరణను ప్రతిపక్ష పార్టీలు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రెండూ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాయి.
‘EPIC’ అంశం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలపై ప్రభావం చూపే “తీవ్రమైన విషయం” అని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ డెరెక్ ఓ’బ్రియన్ అన్నారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత EC వివరణతో వారు సంతృప్తి చెందలేదని ఆయన గుర్తు చేసారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ అంశాన్ని లేవనెత్తడానికి ఆయా పార్టీలు వివిధ నిబంధనల కింద వ్యక్తిగత, ఉమ్మడి నోటీసులను సమర్పించాయని ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి.
పార్లమెంటులో ప్రతిధ్వనించే మరో అంశం డీలిమిటేషన్, త్రి భాషా విధానం.DMK త్రిభాషా విధానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, కేంద్ర ప్రభుత్వం నిధులను నిరాకరించడానికి తీసుకున్న చర్య రాష్ట్రంలో హిందీని విధించడానికి ఉద్దేశించిందని పేర్కొంది.