అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించిన అధికారులు వారిని ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపించేస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న మొత్తం 205 మంది భారతీయులను తీసుకొని కొన్ని గంటల క్రితం టెక్సాస్ నుండి అమెరికా సైనిక విమానం బయలుదేరిందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కూడా దృవీకరించింది.
సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లో అక్రమ వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఫ్లైట్ భారత్‌కు చేరుకునేందుకు సుమారు 24గంటల సమయం పడుతుందని అంచనా. ఇక్కడ ఒక గమనించదగ్గ విషయమేమిటంటే… ఎయిర్-ట్రాన్స్‌పోర్టబుల్ గ్యాలీ అమర్చకపోతే, యుఎస్ వైమానిక దళం సి-17లో 205 మంది ప్రయాణీకులకు ఒకే టాయిలెట్ ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం అమెరికాకు వెళ్తారనే వార్తల నేపథ్యంలో అక్రమ భారతీయ పౌరుల తొలి విడత బహిష్కరణ ప్రారంభం కావడం గమనార్హం. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ తొలి పర్యటన ఇదే.
కాగా, అమెరికాతో సహా విదేశాలలో ‘చట్టవిరుద్ధంగా’ నివసిస్తున్న భారతీయ పౌరులను “వెనక్కి రప్పించేందుకు” న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గతంలో అన్నారు. ఇదే అంశంపై అప్పట్లో ట్రంప్… ప్రధాని మోదీతోనూ ఫోన్లో మాట్లాడారు. ఆ టైంలో “సరైన చర్యలు తీసుకుంటాం అని భారత ప్రధాని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ అన్నారు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం…చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన 18,000 మంది భారతీయ వలసదారులను గుర్తించాయి.
భారతదేశం అక్రమ వలసలను వ్యతిరేకిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎందుకంటే ఇది అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. “అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు గడువు ముగిసి అక్కడ ఉంటున్నట్లయితే, వారు భారతదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తాము” అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పత్రికా సమావేశంలో అన్నారు.
న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి మాట్లాడుతూ… అమెరికా వలస చట్టాలను కఠినతరం చేస్తోంది. అక్రమ వలసదారులను బహిష్కరిస్తోంది” అని అన్నారు.