న్యూఢిల్లీ: ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ సంస్థ ఆస్ట్రేలియా విభాగం వ్యవస్థాపకులలో ఒకరైన బాలేష్ ధంఖర్‌కు ఆ దేశ న్యాయస్థానం 40ఏళ్ల జైలు శిక్ష విధించింది. ధంఖర్ తన అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న సిడ్నీలోని హిల్టన్ హోటల్ బార్లో కొరియన్-ఇంగ్లిష్ అనువాదకుల ఉద్యోగాలు ఉన్నాయని మోసపూరితంగా ప్రకటనలు ఇచ్చి, ఐదుగురు కొరియన్ మహిళలపై ఆయన అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఈ బీజేపీ నేత బాధిత మహిళలకు మత్తు మందులు ఇచ్చి వారిపై లైంగిక దాడి చేశాడని, ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడని కోర్టు 2023 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. ఆయనకు 30 ఏండ్ల పాటు పెరోల్ మంజూరు చేయరాదని జడ్జి ఆదేశించారు. ధన్కర్ బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన ఆస్ట్రేలియా విభాగాన్ని స్థాపించారు. ఇది బీజేపీకి అధికారిక మద్దతుదారు. ధన్కర్ 2006లో చదువు కోవడం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లారు.
కాగా, ఓ బాధిత యువతి ఫిర్యాదుతో నిందితుడు బాలేష్ ధంఖర్ ను ఆస్ట్రేలియా పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. 2023లో అతడిని న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ధంఖర్ కు బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆస్ట్రేలియా మీడియా గుర్తించింది. బాలేష్ ధంఖర్ ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజంలో ఓ గౌరవనీయ వ్యక్తిగా చలామణీ అవుతూనే ఇన్ని ఘోరాలకు పాల్పడ్డాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీకి ఎన్ఆర్ఐ విభాగాన్ని ధంఖర్ స్థాపించాడు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ప్రతినిధిగా వ్యవహరించాడు” అని 9న్యూస్ నివేదించింది.
2014లో సిడ్నీలో మోడీ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడంలో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి’ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. మార్చిలో, ధంఖర్ నేరాల నివేదికలు మొదట వెలుగులోకి వచ్చినప్పుడు, ధంఖర్ 2018లో రాజీనామా చేశారని ఆ సంస్థ ట్వీట్ చేసింది. మొత్తంగా ధంకర్‌ను అరెస్ట్ చేయడంతో ఆస్ట్రేలియాలోని భారతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు.