గౌహతి/న్యూఢిల్లీ:. మణిపూర్‌లో ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని జరిగిన నకిలీ కాల్ స్కామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముగ్గురు నిందితులను ఈ ఉదయం ఢిల్లీ నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు తీసుకువచ్చినట్లు తెలిపాయి.
ఈ మోసగాళ్ళు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్ సహా పలు నాయకులకు ఫోన్ చేసి మంత్రి పదవికి 4 కోట్లు డిమాండ్ చేశారని వర్గాలు తెలిపాయి. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318 (4),319 (2) కింద మోసం, వంచన కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 11న ఉదయం 8.29 గంటల ప్రాంతంలో, ఈ కేసుకు సంబంధించి సబ్-ఇన్‌స్పెక్టర్ ఫారూఖ్ బృందం ముగ్గురు నిందితులను డెహ్రాడూన్ నుండి ఢిల్లీ మీదుగా ఇంఫాల్ పోలీసులు ఇండిగో విమానంలో తీసుకువచ్చారు.
ఈ ముగ్గురు మోసగాళ్లను ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ IIIకి చెందిన ప్రియాంషు పంత్, ఉత్తరప్రదేశ్‌లోని ఎటాకు చెందిన ఉవైష్ అహ్మద్, ఢిల్లీలోని ఘరియాపూర్‌కు చెందిన గౌరవ్ నాథ్‌గా గుర్తించారు.
గత నెలలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, రాష్ట్ర శాసనసభ్యులలో చాలా మందికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా అని చెప్పుకునే వ్యక్తి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని, నాలుగు కోట్లిస్తే మంత్రి పదవులు ఇస్తానని ఆఫర్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో కాల్స్ వచ్చాయి.అదే సమయంలో, జై షా వలె నటిస్తూ… ఉత్తరాఖండ్ బిజెపి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్ నుండి రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన 19 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.