హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA) ఏర్పాటును ప్రకటించింది. FCDA తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్‌మెంట్) చట్టం, 1975 (చట్టం నం. 1 ఆఫ్ 1975) నిబంధనలను ఉపయోగించి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది, జోనింగ్ నిబంధనల మేరకు అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా నియంత్రిస్తుంది.
నిర్దేశిత “ఫ్యూచర్ సిటీ” ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) దాటి, ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మధ్య, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) ఈ ప్రాంతాలలో ఆర్థిక, పారిశ్రామిక క్లస్టర్‌లను అభివృద్ధి చేయనుంది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళికల్లో మల్టీ-మోడల్ కనెక్టివిటీ, ఆధునిక పట్టణ సౌకర్యాలు, మెరుగైన రేడియల్ రోడ్లు, ప్రతిపాదిత మెట్రో కనెక్టివిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో సహా 12 జోన్‌లు ఏర్పాటు కానున్నాయి.
పునర్నిర్మాణంలో భాగంగా, ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అధికార పరిధి నుండి 36 గ్రామాలను తొలగించి, వాటిని – మరో 20 గ్రామాలతో కలిపి – కొత్త FCDAలో చేర్చింది. ఈ పునర్వ్యవస్థీకరణ మొత్తం 56 రెవెన్యూ గ్రామాలను అథారిటీ పరిధిలోకి తెస్తుంది.
మహేశ్వరం, ఆమనగల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్‌సిటీ డెవపల్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు కానుంది. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, మంచాల నుంచి 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 8 గ్రామాలు, కడ్తాల్లోని 6 గ్రామాలు, యాచారం నుంచి 17 గ్రామాలు, కందుకూరు నుంచి 18 గ్రామాలు క్యాబినెట్ ఆమోదంతో ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ కమిషనర్‌గా ఓ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించనుంది.