కోలకత: పశ్చిమ బెంగాల్లో విపక్ష నేత సువేందు అధికారి ముస్లిం ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎమ్మెల్యే ఒకరు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని వీడిన ఒక రోజు తర్వాత ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
“మరో పది నెలల్లో(2026) బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, టీఎంసీ పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపేస్తాం’ అని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ఆ పార్టీని “ముస్లిం లీగ్”తో పోల్చారు.
అసెంబ్లీలో స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో సువేందు అధికారి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. తన ప్రసంగాలలో ఆయన తరచుగా తృణమూల్ కాంగ్రెస్‌ను మతతత్వానికి సంబంధించినదిగా ఆరోపించారు.
ఆయన చేసిన ప్రకటనలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ..సువేందు అధికారి మానసికంగా అస్థిరంగా ఉన్నారని, ఆయన ద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నారని ఆరోపించింది.
అంతకుముందు, 2024 ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ తమకు మద్దతు ఇచ్చి ఓటు వేసే వారితోనే ఉంటుందని ఆయన అన్నారు.