జెరూసలేం: జనవరి 19న కాల్పుల విరమణ తర్వాత గాజా స్ట్రిప్‌లో 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపింది. యూరో-మెడిటరేనియన్ హ్యూమన్ రైట్స్ మానిటర్ కొత్త నివేదిక ప్రకారం సగటున ప్రతి 24 గంటలకు ముగ్గురు వ్యక్తులను చంపటం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం… దిగ్బంధనం, ఆకలి సాధనాలుగా ఉపయోగించి పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపుతోందని ఆ నివేదిక ఆరోపించింది.
యూరో-మెడ్ మానిటర్ ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు గాజాలో 605 మంది పాలస్తీనియన్లను గాయపరిచాయి, సగటున రోజుకు 11 మందికిపైగా గాయపడ్డారు. గాజా, తూర్పు సరిహద్దుల వెంబడి ఉన్న బఫర్ జోన్ సమీపంలో పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని, స్నిపర్ ఫైర్, క్వాడ్‌కాప్టర్, డ్రోన్ దాడుల ద్వారా ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న హత్యల తీరును ఆ సంస్థ ఫీల్డ్ బృందం నమోదు చేసింది. యుద్ధ విరమణ తర్వాత రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోందని ఆ నివేదిక పేర్కొంది.
మానవతా సంక్షోభం
గత 15 నెలలుగా విస్తృత హత్యలు, గాజాలో ఎక్కువ భాగాన్ని నాశనం చేయడంతో పాటు, ఇజ్రాయెల్ తన విధానాలను మరింత ప్రాణాంతక పరిస్థితులను సృష్టిస్తోందని యూరో-మెడ్ మానిటర్ హెచ్చరించింది, ఇది “క్రమంగా,హత్యలకు” దారితీస్తుందని పేర్కొంది.
ఇజ్రాయెల్ దిగ్బంధనం కొనసాగుతున్నందున మానవతా విపత్తు పెరుగుతోందని హక్కుల సంఘం హైలైట్ చేసింది. మార్కెట్లలో అవసరమైన వస్తువులు అయిపోతున్నాయి, మార్చి 2నుండి గాజా క్రాసింగ్‌లు మూసివేయడం వల్ల అనేక సహాయ కేంద్రాలు, ఆశ్రమాలు కార్యకలాపాలను నిలిపివేసాయి.
పాలస్తీనియన్లకు – ముఖ్యంగా పిల్లలకు – తగినంత పోషకాహారం అందకపోవడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి కూడా ఇది హెచ్చరించింది. అంతేకాదు పోషకాహార లోపం, కోలుకోలేని ఆరోగ్య నష్టం,శాశ్వత శారీరక-మానసిక వైకల్యాలకు దారితీస్తుందని వాపోయింది.
అంతర్జాతీయ చర్యకు పిలుపు
యూరో-మెడ్ మానిటర్ అన్ని సంబంధిత దేశాలు, సంస్థలను వారి చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చాలని, గాజాలో జరిగిన మారణహోమంగా అభివర్ణించిన దానిని నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. యుద్ధ నేరాలకు పాల్పడిన ఇజ్రాయెల్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)ని కూడా కోరింది.
42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి దశ మార్చి 1, శనివారంతో ముగిసింది. అయితే, ఇజ్రాయెల్ రెండవ దశ చర్చలు జరిపేందుకు, కాల్పుల విరమణను శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించడం లేదు.
కాల్పుల విరమణ మొదటి దశ ముగిసిన తర్వాత, ఇజ్రాయెల్ అన్ని గాజా క్రాసింగ్‌లను మూసివేసింది, హమాస్‌పై ఒత్తిడి తీసుకురావడానికి మానవతా సహాయాన్ని అడ్డుకుంది. తరువాత అది విద్యుత్తును నిలిపివేసింది.