న్యూఢిల్లీ: తమిళనాడు బడ్జెట్ పత్రంలో అధికారిక రూపాయి చిహ్నం స్థానంలో… తమిళ అక్షరాన్ని ఏర్పాటు చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇది “ప్రాంతీయ దురభిమానం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రూపాయి గుర్తుతో సమస్య ఉంటే.. అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డీఎంకే ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్ వేదికగా ఆమె నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
అంతేకాదు ‘₹’ సింబల్‌ను రూపొందించిన ఉదయ్ కుమార్.. డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడే కావడం గమనార్హమన్నారు. బడ్జెట్ పత్రాల్లో రుపీ గుర్తును తొలగించడం ద్వారా ఓ జాతీయ గుర్తును డీఎంకే తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి క్రియేటివిటీని డీఎంకే విస్మరించిందని నిర్మలా సీతారామన్ Xవేదికగా విమర్శించారు.
డీఎంకే చర్యలు.. దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి.. ప్రాంతీయ అస్థిత్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి.. భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణ’’ అని నిర్మలమ్మ తీవ్రంగా స్పందించారు.
అంతేకాకుండా, ‘రూపాయి’ అనే తమిళ పదం సంస్కృతంలోని ‘రూప్యా’పదం నుంచి వచ్చింది. దీని అర్థం ‘చేతులతో తయారు చేసిన వెండి నాణెం’. “ఈ పదం శతాబ్దాలుగా తమిళ వాణిజ్యం,సాహిత్యంలో ప్రతిధ్వనించింది. నేటికీ, తమిళనాడు,శ్రీలంకలో ‘రూపాయి’ కరెన్సీ పేరుగా ఉంది” అని సీతారామన్ అన్నారు. ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్, నేపాల్, సీషెల్స్, శ్రీలంక వంటి దేశాలు అధికారికంగా రూపాయి లేదా దాని ‘సమానమైన/పేర్లను’ తమ కరెన్సీ పేరుగా ఉపయోగిస్తున్నాయని ఆమె ఉదహరించారు.
“రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆర్థిక లావాదేవీలలో భారతదేశానికి కనిపించే గుర్తింపుగా పనిచేస్తుంది. ఈ తరుణంలో యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూంటే… సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా?… ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు… కానీ రుపీ గుర్తును తొలగించడం ఆ ప్రమాణానికే విరుద్ధం.. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందని నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.