వనపర్తి : నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసే వారిపై కఠిన శిక్షలు విధిస్తామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ జడ్జి వి. రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం… రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి రైతు రైతు చట్టాల గురించి తెలుసుకోవాలని అన్నారు. అదేవిధంగా, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే లక్ష్యంతో విత్తన చట్టాన్ని 1966లనే రూపొందించారని ఆమె గుర్తచేశారు. వ్యవసాయ ఉత్పత్తుల MRP ధర కంటే ఎక్కువ ధరకు అమ్మినా… నకిలీ విత్తనాలు అంటగట్టినా… రైతులు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయాలని సీనియర్ జడ్జి వి. రజని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి మాట్లాడుతూ… రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పారు. పెబ్బేరు మండలానికి చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ… వ్యవసాయ రుణాలు పొందడానికి అవసరమైన అర్హతలు, పత్రాల గురించి రైతులకు తెలియజేశారు. కాగా ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య, ఏడీ శివ నాగిరెడ్డి, AEOలు జయశ్రీ , ఆంజనేయులు, ప్రశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.