ముంబయి: మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత నాగ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం హింసాత్మక ఘర్షణలు జరిగాయి, 30 మందికి పైగా గాయపడ్డారు. హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది.
నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణ తర్వాత దాదాపు 60 నుండి 65 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమైయ్యాయి. దీంతో నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘర్షణలో 25 నుండి 30 మంది సిబ్బంది గాయపడ్డారు.
కాగా, ఘటన స్థలాన్ని సందర్శించిన నాగ్‌పూర్ సెంట్రల్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ప్రవీణ్ దాట్కే, హింసాత్మక ఘర్షణలు ముందస్తు ప్రణాళికతో జరిగాయని పేర్కొన్నారు. “ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగింది. నిన్న ఉదయం జరిగిన ఆందోళన తర్వాత, గణేష్ పేట్ పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగింది, ఆ తర్వాత అంతా సాధారణంగానే ఉంది… ఓ గుంపు హిందూ ఇళ్ళు, దుకాణాలలోకి ప్రవేశించింది… మొదట, అన్ని కెమెరాలను ధ్వంసం చేశారు, ఆపై ముందస్తు ప్రణాళికతో హింస జరిగింది.” పోలీసులు హిందూ పౌరులకు మద్దతు ఇవ్వలేదని మరియు ఆ గుంపులో ఎక్కువ భాగం బయటి నుండి వచ్చారని ఆయన ఆరోపించారు.
సంభాజీ నగర్‌లోని ఔరంగజేబ్ సమాధిపై పెద్ద వివాదం చెలరేగిన నేపథ్యంలో, బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ (VHP) వంటి హిందూ సంస్థలు దానిని కూల్చివేయాలని కోరుతూ నిరసన చేపట్టాక ఘర్షణలు జరిగాయి. ఘర్షణలు చెలరేగడానికి కొన్ని గంటల ముందు, సోమవారం ఉదయం నాగ్‌పూర్‌లో రెండు గ్రూపులు నిరసనలు నిర్వహించాయి.
అల్లర్లకు పాల్పడినవారిని ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని.. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. అయితే వదంతులను నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలను కోరారు.
నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ సింగల్ మాట్లాడుతూ.. నగరంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని అన్నారు. ఒక ఫోటోను తగలబెట్టిన తర్వాత అల్లర్లు ప్రారంభమయ్యాయని, దీని కారణంగా ప్రజలు గుమిగూడి ఆందోళనలు చేపట్టారని ఆయన వివరించారు. రాత్రి 8 నుండి 8:30 గంటల ప్రాంతంలో హింస జరిగింది, ఈ సమయంలో రెండు వాహనాలు తగలబెట్టారు. రాళ్ల దాడి సంఘటనలు జరిగాయి. ఇందులో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేయడానికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు.
“మేము సెక్షన్ 144 విధించాము. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ కోరారు. అంతేకాదు పుకార్లను నమ్మవద్దు” అని ఆయన అన్నారు.
సహాయం కోసం నాగ్‌పూర్ గ్రామీణ పోలీసులను పిలిపించారు. పుకార్ల వ్యాప్తిని అరికట్టడానికి సైబర్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ హింస ఫలితంగా 25 నుండి 30 ద్విచక్ర వాహనాలు 2 నుండి 3 కార్లు దహనం అయ్యాయి.
నాగ్‌పుర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై Xలో పోస్టు చేశారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. “పరిస్థితి గురించి ముఖ్యమంత్రికి ఇప్పటికే సమాచారం అందింది, కాబట్టి పుకార్లను పట్టించుకోవద్దన ఆయన అభ్యర్థించారు”
నాగ్‌పూర్‌లో సోమవారం జరిగిన హింసకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ రాష్ట్ర హోం శాఖను నిందించారు, ఇది వారి వైఫల్యమని అన్నారు. ఇటీవలి రోజుల్లో మంత్రులు “ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని” ఆయన ఆరోపించారు.
నాగ్‌పూర్‌లో శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, పుకార్లను నివారించాలని మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ప్రజలను కోరారు. హింసకు కారణాన్ని దర్యాప్తు కమిటీ నిర్ణయిస్తుందని, శాంతిని కాపాడటానికి పోలీసులు చేసే ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.
ప్రశాంతతను ప్రోత్సహించే క్రమంలో భాగంగా… బాధ్యులను గుర్తిస్తారని ప్రజలకు భరోసా ఇవ్వడంలో మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, నాయకులు ఐక్యంగా ఉండాలని బావాంకులే పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఈ సంఘటనను రాజకీయం చేయొద్దని ఆయన హెచ్చరించారు.
హింసాత్మక ఘర్షణల తరువాత నాగ్‌పూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా, శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించడానికి అధికారులు సిసిటివి ఫుటేజ్, ఇతర వీడియో క్లిప్‌లను సమీక్షించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు.