హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ ప్రభుత్వం రూ.17,677 కోట్ల కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ట్రాఫిక్ రద్దీని సమర్ధవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం H-CITI ప్రణాళికను హైలైట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల అంచనా పెట్టుబడితో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్‌పాస్‌లు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను చేపట్టగా, సుందరీకరణ ప్రాజెక్టుల కోసం రూ.150 కోట్లు కేటాయించారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వద్ద మొత్తం 20 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదనంగా, ఈ జలాశయాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి జలాలతో నింపుతారు.
పట్టణ వరదలను తగ్గించడానికి, ప్రభుత్వం రూ. 5,942 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ స్టార్మ్‌వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను కూడా మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు.
“ఈ ఫ్యూచర్ సిటీలో మల్టీమోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్, గ్రీన్ బిల్డింగ్‌లు ఉంటాయి, అంతేకాదు ఇందులో AI సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ వంటి ప్రత్యేక జోన్‌లు ఉంటాయి.
అదనంగా, స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్, ఎఫెక్టివ్ డెలివరీ) గురించి కూడా మంత్రి చర్చించారు, ఇది నిర్ణీత కాలపరిమితిలోపు 19 కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రో రైలు విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణం, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనం ఉన్నాయి.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బడ్జెట్ రూపురేఖలు
మొత్తం వ్యయం రూ. 7,639.96 కోట్లు, ఇందులో నీటి సరఫరా, పారిశుధ్యం కోసం రూ. 3,085 కోట్లు రుణాలు, పట్టణ అభివృద్ధికి రూ.1,200 కోట్లు ఉన్నాయి. మొత్తం పథకం వ్యయం రూ. 10,037 కోట్లుగా అంచనా వేశారు.
మునిసిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధికి మొత్తం రూ. 5,213.67 కోట్లు మూలధన వ్యయం కేటాయించారు.
స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పట్టణ అభివృద్ధి అధికారులు, పట్టణ అభివృద్ధి బోర్డులకు రూ. 4,701.92 కోట్లుగా అంచనా .
కీలక బడ్జెట్ కేటాయింపులు
వైకుంఠ ధామాలు – రూ.75 కోట్లు
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ – రూ.100 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి – రూ.1,500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ – రూ.500 కోట్లు
విమానాశ్రయం మెట్రో కనెక్టివిటీ – రూ.100 కోట్లు
మల్టీ-మోడల్ సబర్బన్ రైలు రవాణా వ్యవస్థ – రూ.50 కోట్లు
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ – రూ.100 కోట్లు
కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – రూ.63.37 కోట్లు
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ – రూ.200 కోట్లు
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ – రూ.100 కోట్లు
మహబూబ్‌నగర్, మంచిర్యాల్, కొత్తగూడెం, పాల్వంచ మునిసిపాలిటీలు/కార్పొరేషన్లు – రూ.754.70 కోట్లు
సమగ్ర కూరగాయలు, మాంసం మార్కెట్లు – రూ.100 కోట్లు