కైరో : అరబ్ లీగ్ మద్దతుతో గాజా పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చర్య అబుదాబి, కైరో మధ్య గాజా భవిష్యత్తు పాలనపై విభేదాలను సూచిస్తుంది.
మార్చి ప్రారంభంలో, మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజా రాజకీయ పరివర్తన, పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం ఈజిప్ట్ కైరో డిక్లరేషన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రణాళికలో పాలస్తీనియన్ అథారిటీ (PA) పాలన, జోర్డాన్, ఈజిప్ట్ శిక్షణ పొందిన భద్రతా దళం, గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ రెండింటిలోనూ UN శాంతి పరిరక్షక దళం మోహరింపు ఉన్నాయి. కాగా, గాజాను అమెరికా ఆధీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. అనేక యూరోపియన్ దేశాలు ఈజిప్ట్ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినప్పటికీ, యుఎస్, ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకించాయి.
అయితే, కైరో ప్రతిపాదనపై వాషింగ్టన్ వ్యతిరేకతను యుఎఇ బలపరుస్తోందని సమాచారం. మిడిల్ ఈస్ట్ ఐ నివేదిక ప్రకారం… అమెరికాలోని ఎమిరేట్స్ రాయబారి యూసఫ్ అల్-ఒటైబా అమెరికా చట్టసభ సభ్యులు, ట్రంప్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులతో లాబీయింగ్ చేస్తున్నారని అమెరికా, ఈజిప్టు అధికారులు వెల్లడించారు. గాజా నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడాన్ని అంగీకరించేలా ఈజిప్టుపై ఒత్తిడి తీసుకురావడమే అతని ప్రయత్నాల లక్ష్యం అని ఆరోపణలు ఉన్నాయి.
ఈజిప్టు ప్రణాళిక అసమర్థమైనదని, హమాస్‌ను బలోపేతం చేస్తోందని పేర్కొంటూ, యుఎఇ దౌత్య మిషన్ కూడా ఈజిప్టు ప్రణాళికను కించపరిచేలా పనిచేస్తోంది. కైరో తన ప్రతిపాదనను ఉపసంహరించుకుని, గాజాను జనాభా లేకుండా చేయాలనే ట్రంప్ మద్దతుగల “రివేరా” ప్రణాళికకు మద్దతు ఇస్తేనే ఈజిప్టుకు అమెరికా సైనిక సహాయాన్ని కొనసాగించాలని యుఎఇ వాషింగ్టన్‌ను కోరుతోందని నివేదిక సూచిస్తుంది.
అరబ్ లీగ్ ప్రణాళికపై ఒప్పందం కుదిరినప్పుడు, దానిని వ్యతిరేకించిన ఏకైక దేశం యుఎఇ కాకపోవచ్చు, కానీ వారు ట్రంప్ పరిపాలనతో కలిసి దానిని తెరవెనుక అణగదొక్కడానికి పనిచేస్తున్నారు” అని పేరు తెలపడానిక ఇష్టపడని యుఎస్ అధికారి ఒకరు ఇలా అన్నారు,
కాగా, ఈజిప్టు US నుండి ఏటా $1.3 బిలియన్ల సైనిక సహాయాన్ని అందుకుంటుంది, అందులో $300 మిలియన్లు ఇప్పటికే మానవ హక్కుల నిబంధనలకు లోబడి ఉన్నాయి. గత ఆరు వారాలుగా, ట్రంప్ ప్రభుత్వం ఈ ఆర్థిక పరపతిని ఉపయోగించి ఈజిప్ట్, జోర్డాన్‌లను అంగీకరించమని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. పాలస్తీనా పునరావాస ప్రాజెక్టుపై తన వైఖరిని మార్చుకోకపోతే సహాయాన్ని తగ్గించుకోవచ్చని వాషింగ్టన్ కైరోను హెచ్చరించినట్లు గత వారం, నివేదికలు వెలువడ్డాయి.