రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో నిన్న జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మొదటి ఆపరేషన్ బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో జరగ్గా, రెండవది కాంకేర్-నారాయణ్‌పూర్ సరిహద్దు సమీపంలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందారు.
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించగా, కాంకేర్‌లో మరో నలుగురు హతమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇరు వైపులా భారీ కాల్పులు కొనసాగాయి. భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుండి ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు హతమైన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి, ఇది తిరుగుబాటుదారులకు గణనీయమైన దెబ్బ.
మరొక సంఘటనలో, నారాయణపూర్-దంతేవాడ సరిహద్దుకు సమీపంలో ఉన్న తుల్తులి ప్రాంతంలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు సిబ్బంది క్షేమంగా ఉన్నారని,వైద్యుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నారని సమాచారం.
గంగలూర్ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఉమ్మడి ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
బుధవారం ఆండ్రి ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి, గురువారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా 26 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.
‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ఇది పెద్ద విజయం అని హోంమంత్రి అమిత్ షా Xలో పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మన దేశం ‘నక్సల్ రహితం’ కానుందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. అలాగే, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి భద్రతా దళాలను ప్రశంసించారు.