పాట్నా: అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై బీహార్ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ కృష్ణ మోహన్ మొబైల్ ఫోన్ వాడటాన్ని గమనించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సహనం కోల్పోయారు. అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం ఉందని, ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం నితీష్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అతిగా మొబైల్ ఫోన్ వాడితే కలిగే ప్రతికూల ప్రభావం గురించి ఆయన హెచ్చరించారు. “ఇంతకుముందు, మేము మొబైల్‌ను ఎక్కుగా చూసేవాళ్ళం. ఇబ్బందులు ఉంటాయని మాకు తెలుసు, కాబట్టి మేము దానిని 2019 లో ఆపాము. ఇది ఇలాగే కొనసాగితే, రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచం అంతం అవుతుంది” అని ఆయన అన్నారు.
కాగా, బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ లోపల ఆర్జేడీ ఎమ్మెల్యేను మందలించిన క్లిప్ ఆన్లైన్లో కనిపించింది. మరోవంక మొబైల్ ఫోన్ల వాడకం వల్ల 10 సంవత్సరాలలో భూమి నాశనం అవుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన తర్వాత కొత్త రాజకీయ వివాదం చెలరేగింది.
ఇక ఈ అంశంపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందించారు. కంప్యూటర్ అంటే తెలియని బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు.. సెల్ ఫోన్ సైతం సమస్యగా మారిందని వ్యంగ్యంగా అన్నారు. టెక్నాలజీ వ్యతిరేకి, యువత, విద్యార్థులు, మహిళలకు వ్యతిరేకి అయిన సంప్రదాయవాది బిహార్‌కు సీఎం ఉండడం దురదృష్టకరమని తేజస్వీ యాదవ్ అభివర్ణించారు. పర్యావరణ పరి రక్షణ కోసం.. అసెంబ్లీని కాగిత రహితంగా ప్రభుత్వం మార్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు అడిగే ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవ్వాలంటే.. సెల్ ఫోన్ లేదా ట్యాబ్ వినియోగించాల్సి ఉందన్నారు.
కాగా, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సైతం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ల కారణంగా ప్రపంచం పదేళ్లలో అంతమవుతుందని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి చెబుతున్నారా?” “పిచ్చికి, అర్ధంలేని మాటలు మాట్లాడటానికి ఒక పరిమితి ఉంది!” అని ఆయన అన్నారు.