హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2025) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాణించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు గేట్2025 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు ఆ విద్యార్థులను సత్కరించారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సానియా మహ్రీన్ (AIR-13), భరం ప్రసన్న దేవిక (AIR-44), హిబా ఫాతిమా రషీద్ (AIR-93) అనే విద్యార్థులు ఉన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం వారిని ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలను కొనసాగించమని ప్రోత్సహించారు.
కాగా, ఇంజినీరింగ్ గేట్-2025లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లో నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన సాదినేని నిఖిలౌచౌదరి, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో వరంగల్‌కు చెందిన కీర్తి రేవంత్‌కుమార్ జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
వరంగల్ దేశాయిపేటకు చెందిన కీర్తి నాగరాజు, కవిత దంపతుల పెద్ద కుమారుడు రేవంత్ కుమార్. తండ్రి నాగరాజు ఆత్మకూరు రాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, కవిత గృహిణి, ముంబయిలోని మంచి కళాశాలలో ఎంటెక్ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రేవంత్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు.
రేవంత్.. ప్రయాగ్‌రాజ్‌లోని సామ్ హిగ్గిన్ బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ చేశాడు. గత నెల 1, 2, 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా గేట్ ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది పరీక్ష రాసినట్లు సమాచారం.