గాజా : ఇజ్రాయెల్ గాజా ఆదివారం జరిపిన తాజా వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హమాస్ సీనియర్ రాజకీయ నేత సలా బర్దావిల్, ఆయన భార్య కూడా ఉన్నారు. దీంతో 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనా భూభాగంలో కనీసం 50వేల 21 మంది మరణించారని హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసే కావడం గమనార్హం. యుద్ధంలో ఇప్పటివరకు 1,13,000 మంది గాయపడ్డట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా, ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకొని తాజాగా దాడి జరిగిందని గాజు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిస్తే దాడిని ధృవీకరించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 673 మంది మృతిచెందారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023 అక్టోబర్ 7నప్రారంభమైన సంగతి తెలిసిందే. ఖాన్ యూనిస్ నగరంపై ఆదివారం ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో మరణించిన హమాస్ కీలక నేత హమాస్ సీనియర్ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడు కూడా. ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు
హమాస్ బందీలుగా చేసుకున్న వారిని విడిచిపెట్టకపోతే దాడులు మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తాజాగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రఫా పట్టణంలోకి దూసుకుపోయాయి.