హైదరాబాద్: లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న రైలు నుంచి దూకిన 23 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మార్చి 22 సాయంత్రం సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్తున్న MMTS రైలులోని మహిళల కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ రైల్వే స్టేషన్ లో దిగిపోయాక, రైలులో ఆమె ఒంటరిగా మిగిలారు. కొద్దిసేపటికే, 25 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరించడంతో, ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతన్నుంచి తప్పించుకునేందుకు గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని గుర్తించిన స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల, గడ్డం, కుడి చేయి, నడుముపై గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
అనంతపురంలోని ఉరవకొండకు చెందిన ప్రైవేట్ రంగ ఉద్యోగి అయిన బాధితురాలు మేడ్చల్‌లోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఆమె ఆ రోజు తన మొబైల్ ఫోన్ రిపేర్ చేయించేందుకు సికింద్రాబాద్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఈ దుస్సంఘటన జరిగింది.
నిందితుడు… సన్నని, నల్లటి రంగు చొక్కా ధరించి ఉన్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని మళ్ళీ చూస్తే తాను గుర్తించగలనని ఆ మహిళ పోలీసులకు చెప్పింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 75, 131 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని సికింద్రాబాద్ GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ ధృవీకరించారు.