లక్నో: గత ఏడాది నవంబర్ 24న సంభాల్‌లో చెలరేగిన హింసకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) జియా-ఉర్ రెహమాన్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ హింసలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు, వీరిలో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.
మొదటి సమాచార నివేదికలలో (FIR) ఒకదానిలో “ప్రధాన నిందితుడు”గా పేర్కొన్న ఎంపీని పోలీసులు విచారణ కోసం పిలిపించారు, హింసకు ముందు, తరువాత అతని పాత్రను నిర్ధారించుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
హింసకు సంబంధించి జామా మసీదు కమిటీ చీఫ్ జాఫర్ అలీని అరెస్టు చేసిన తర్వాత పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41(A) కింద సమాజ్‌వాదీ ఎంపీకీ త్వరలో నోటీసు జారీ చేస్తామని, విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించారు.
సంభాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) కృష్ణ కుమార్ బిష్ణోయ్ ప్రకారం, ఎంపీ జియావుర్ రహమాన్‌ను ప్రశ్నించడం కొనసాగుతున్న దర్యాప్తులో ఒక ముఖ్యమైన భాగం. “ఈ కేసులో నిందితుడిగా ఎంపీ పేరున్నందున ఇది ఒక విధానపరమైన చర్య. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన అన్ని చట్టపరమైన విధానాలను మేము అనుసరిస్తున్నాము” అని బిష్ణోయ్ అన్నారు.
సంఘటనకు ముందు, తరువాత ఎంపీ సంభాషణలు, ఆయన ప్రకటనలు, కోర్టులో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని ఎంపీ జియావర్ రహమాన్ గతంలో పిటిషన్ దాఖలు చేయగా, అలహాబాద్ హైకోర్టు అతనికి అరెస్టు నుండి తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
సంభాల్‌లోని చారిత్రాత్మక ప్రదేశమైన షాహి జామా మసీదుపై కోర్టు ఆదేశించిన సర్వే సందర్భంగా హింస చెలరేగి, ఇరువర్గాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. మసీదు ఒక పురాతన హిందూ ఆలయంపై నిర్మించారనే ఆరోపణలో నేపథ్యంలో భాగంగా చేపట్టిన సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. హింస తర్వాత, చట్టవిరుద్ధంగా సమావేశమవడం, అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకోవడం, మతపరమైన వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలతో సహా భారత శిక్షాస్మృతి (IPC)లోని బహుళ విభాగాల కింద కేసు నమోదు చేశారు.
తొలిసారి ఎంపీగా ఎన్నికైన జియావుర్ రహమాన్, ప్రముఖ రాజకీయ నాయకుడు షఫీకుర్ రెహమాన్ బార్క్ మనవడు, ఎఫ్ఐఆర్లో పేరున్న ప్రముఖ వ్యక్తులలో ఒకరు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే కుమారుడు సోహైల్ మహమూద్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. చట్టవిరుద్ధంగా సమావేశమవడం, మారణాయుధాలతో అల్లర్లు చేయడం, తీవ్ర నష్టం కలిగించడం వంటి అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లో అభియోగాలు నమోదు చేశారు.
పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా హింసకు సంబంధించి కనీసం 79 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారందరూ ప్రస్తుతం జైలులో ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు హింసకు అంతర్లీన కారణాలను పరిశీలిస్తున్నారు.
ఇంతలో, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) అధికారుల బృందం సోమవారం ఎంపీ ఇంటికి చేరుకుని కొలతలు వేసింది. ఆ ఇంటి నిర్మాణ ప్రణాళిక సరిగ్గా లేదని ఆరోపించారు. అనధికార నిర్మాణానికి సంబంధించి స్థానిక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) కోర్టులో కేసు నమోదు చేశారు.
కాగా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున, సమాజ్‌వాదీ ఎంపీ జియావుర్ రెహమాన్, ఇతర నిందితులకు సంబంధించిన చట్టపరమైన చర్యలపై అందరి దృష్టి ఉంది.