కైరో: గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా అల్-సిసి, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్రంగా ఖండించారు. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో, వారు తక్షణ కాల్పుల విరమణ ఆవశ్యకతను వ్యక్తపరిచారు. అంతేకాదు గాజా స్ట్రిప్‌లోకి ఇజ్రాయెల్ భూ చొరబాటును ముగించాలని కోరారు. అలాగే మానవతా సహాయం తక్షణమే అందించాలని నొక్కిచెప్పారని జిన్హువా వార్తా సంస్థ ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం నుండి జారీ అయిన ఒక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది.
పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమేసే ప్రయత్నాలకు ఈజిప్ట్ వ్యతిరేకం అని ఈజిప్ట్ అధినేత సిసి పునరుద్ఘాటించారు. మరోవంక గాజాను పునర్నిర్మించడానికి అరబ్ దేశాల నేతృత్వంలోని ప్రణాళికకు సాంచెజ్ మద్దతు ఇచ్చాడు. గాజా నుంచి పాలస్తీనియన్లను బలవంతంగా ఖాళీ చేయించాలన్న అమెరికా ప్రతిపాదనను తిరస్కరించడంలో ఈజిప్టుతో పాటు స్పెయిన్ కూడా చేరిందని అధ్యక్ష కార్యాలయం ప్రకటన పేర్కొంది.
కాగా, ఈజిప్ట్ అధ్యక్షుడితో తన ఫోన్ సంభాషణను స్పెయిన్ ప్రధాని సాంచెజ్ Xపోస్ట్ ద్వారా దృవీకరించారు. గాజాలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు వెంటనే కాల్పుల విరమణ పునరుద్ధరించాలని స్పెయిన్ ప్రధాని పిలుపునిచ్చాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా జరుగుతున్న “విధ్వంసం, మరణాలు ఆగిపోవాలని” అని ఆయన అన్నారు. ఇద్దరు నాయకులు సిరియా, లెబనాన్ పరిస్థితులను కూడా చర్చించారు, రెండు దేశాల ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
జనవరి 19న హమాస్‌తో ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మార్చి 18న ఇజ్రాయెల్ గాజాలో దాడులను తిరిగి ప్రారంభించింది. ఇజ్రాయెల్ దళాలు తరువాత దక్షిణ, ఉత్తర, మధ్య గాజాలో భూ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఫలితంగా మరణించిన వారి సంఖ్య 792కి చేరుకుందని గాజాకు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు.