హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించాలని, ఏవైనా మార్పులను ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.
డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ సౌత్‌కు లిమిటేషన్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1971 నుంచి జనాభా నియంత్ర ణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయని, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ సీట్ల సంఖ్యను యధాతథంగా కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రస్తుత సరిహద్దులను మార్పు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.
జనాభా స్థిరీకరణకు సంబంధించిన వారి లక్ష్యాలు నెరవేరలేదని ఆయన 42, 84, 87వ రాజ్యాంగ సవరణలను ప్రస్తావించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు జనాభా గణాంకాలు మాత్రమే ఏకైక ప్రమాణం కాకూడదని ఆయన నొక్కి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుండి 153కి పెంచాలని కూడా ఇది పిలుపునిచ్చింది. తమిళనాడు ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో జరిగిన సమావేశం కూడా ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై ఇలాంటి ఆందోళనలను లేవనెత్తిందని ముఖ్యమంత్రి ఎత్తి చూపారు. ప్రస్తుతం ప్రణాళిక ప్రకారం అమలు చేస్తే, పునర్వ్యవస్థీకరణ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24% తగ్గుతుందని ఆయన హెచ్చరించారు.
డీలిమిటేషన్ ప్రక్రియను న్యాయంగా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా నిర్వహించాలని అసెంబ్లీ నొక్కి చెప్పింది. మనందరం కలిసికట్టుగా ఉన్నామన్న సంకేతాన్ని కేంద్రానికి పంపాలని, సీట్లు తగ్గితే సౌత్ మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో అన్ని సంఘాలతో చర్చలు జరిపామని సిఎం తెలిపారు.