హైదరాబాద్ : తెలంగాణ అంతటా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు,ఈద్గాల వద్ద ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లో మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదులలో పెద్ద సంఖ్యలో జనం ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ఆచరించారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మీర్ ఆలం ఈద్గాలో నమాజ్ చదివారు. దేశంలో శాంతి, న్యాయం జరగాలని దుఆ చేశారు. . “ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మన దేశంలో అందరికీ శాంతి, న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము” అని ప్రార్థనలు చేసిన తర్వాత ఓవైసీ మీడియాతో అన్నారు.
అదేవిధంగా, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు సహా పలువురు నాయకులు కూడా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మీర్ ఆలం ఈద్గాలో లక్ష మందికి పైగా సామూహిక నమాజ్‌లో పాల్గొన్నారు. మక్కా మసీదు ఖతీబ్ మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషి ఈద్ నమాజ్‌కు నాయకత్వం వహించారు. కొన్ని మసీదులు ఉదయం 7 గంటలకు ప్రార్థనలు నిర్వహించగా, మరికొన్ని ఉదయం 10 గంటలకు ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించాయి.
మాదన్నపేటలోని పాత ఈద్గా, కుతుబ్ షాహి సమాధులు ఈద్గా, మసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్, సికింద్రాబాద్‌లోని ఈద్గా బాలంరాయ్, ఇతర ప్రదేశాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ నగర పోలీసులు తమ కమిషనర్ సివి ఆనంద్‌తో కలిసి ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకున్నారు, మీర్ ఆలం ఈద్గాలో పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సహా ఇతర పోలీసు అధికారులు కూడా ఏర్పాట్లలో పాల్గొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తు ఈద్గాల వద్ద ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.