న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పంజాబ్‌కు చెందిన అనేక ప్రముఖ సిక్కు సంస్థలు, పాంథిక్ పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా గురుద్వారాలను నిర్వహించే సిక్కుల అత్యున్నత సంస్థలుగా పేరుగాంచిన శిరోమణి అకాలీదళ్‌తో సహా మిగతా సంస్థలు బిల్లును ఖండించాయి. ఇది “ముస్లిం వ్యతిరేకమని” ప్రకటించాయి. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభలో జరిగిన చర్చలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిజెపి పార్టీ “మతం,కులం ఆధారంగా ప్రజలను విభజిస్తోంది” అని ఆరోపించారు. “వక్ఫ్ సవరణ బిల్లు వివక్షతతో కూడుకున్నది, మైనారిటీలను మతపరంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శింశారు. సిక్కుల స్వతంత్ర గుర్తింపును గుర్తించడానికి ఆర్టికల్ 35 (బి)ని సవరించడం వంటి సిక్కుల డిమాండ్లను బిజెపి చాలా కాలంగా విస్మరిస్తోంది, కానీ వారు రాజకీయ ప్రతీకారం కోసం అలాంటి బిల్లులను తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు.
వక్ఫ్ బిల్లు ఆమోదంతో.. సిక్కులు ముస్లింలకు తమ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం, జమియత్ ఉలేమా-ఎ-హింద్ సభ్యులు అనేక మంది సిక్కు నాయకులతో సమావేశమయ్యారు. వక్ఫ్ బిల్లు, రెండు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సిక్కు-ముస్లిం ఐక్యతను ఎలా పెంపొందించాలన్న అంశాలపై చర్చించారు.
సిక్కు నాయకులలో ఒకరైన జస్తదార్ గర్గజ్ వివాదాస్పద బిల్లులను ఆమోదించే విషయంలో బిజెపి వేగంగా పనిచేస్తుందని హైలైట్ చేశారు. ఆయన మాట్లాడుతూ, “బిజెపి మైనారిటీల హక్కులను అణచివేసే బిల్లులను త్వరగా ఆమోదిస్తుంది. మతాలు, సంస్కృతులు, భాషలతో సమృద్ధిగా ఉన్న ఈ దేశం అందరికీ చెందినది, ప్రతి ఒక్కరికీ వారి హక్కులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. .
పంజాబ్ బిజెపి అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ బలైవాల్ మాట్లాడుతూ.. సిక్కులు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, ఎందుకంటే దానికి వారితో సంబంధం లేదని అన్నారు. ఈ బిల్లు ముస్లింల శ్రేయస్సు కోసమేనని ఆయన అన్నారు. దీనికి విరుద్ధంగా వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిక్కు ఎంపీలు బిల్లును విమర్శిస్తూ, తిరస్కరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నందున, ఉపసంహరణ డిమాండ్లు మరింత బలంగా పెరిగి ఊపందుకుంటున్నందున అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వంపై ఉంది.