బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై ఏకంగా 104 శాతం సుంకాలను విధించారు. దీంతో చైనా-యునైటెడ్ స్టేట్స్ పూర్తి వాణిజ్య యుద్ధం వైపు అడుగులు వేసాయి. అధిక-పన్నుల ఆటలో చిక్కుకున్న రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి నిరాకరించాయి, బీజింగ్ అమెరికా దూకుడుకు వ్యతిరేకంగా “చివరి వరకు” పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది.
ట్రంప్ మొదట చైనా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించింది. అయితే, బీజింగ్ అమెరికన్ ఉత్పత్తులపై తనదైన రీతిలో 34 శాతం సుంకాన్ని విధించిన తర్వాత, వాషింగ్టన్ మరో 50 శాతం సుంకాన్ని పెంచుతామని ప్రతిజ్ఞ చేసింది. కొత్త పన్నులతో పాటు, ఫిబ్రవరి,మార్చిలో విధించిన ప్రస్తుత సుంకాలను లెక్కిస్తే, చైనా వస్తువులపై సుంకం పెరుగుదల 104 శాతంగా తేలింది.
చైనా ప్రతిచర్య
చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అసంబద్దమని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిగా తీసుకున్న ప్రతీకార చర్యలు తమ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమేనని తెలిపింది. సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటుగా పేర్కొంది. అమెరికా బెదిరింపుల స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని డ్రాగన్ దుయ్యబట్టింది. అమెరికా ఇదే వైఖరిని కొనసాగిస్తే మాత్రం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది.
మంగళవారం యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా, చైనా ప్రీమియర్ లి కియాంగ్ మాట్లాడుతూ… అమెరికా బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. “మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది ఈ బ్లాక్ మెయిలింగ్ కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.
ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్ విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. చైనా దృఢమైన ప్రతిస్పందన దాని స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నియమాలను రక్షించడం కూడా అని ఆయన అన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ట్రంప్ పై బీజింగ్ వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత కొత్త సుంకాలు విధించారు.
ట్రంప్ వాణిజ్య యుద్ధం
ట్రంప్ బేస్‌లైన్ 10 శాతం సుంకాలు వారాంతంలో అమలులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపుకు గురైంది, ఇది ప్రపంచవ్యాప్తంగా నాటకీయ మార్కెట్ అమ్మకాలకు దారితీసింది, మాంద్యం భయాలను రేకెత్తించింది.
అమెరికా అధ్యక్షుడు మాత్రం… తన టారిఫ్ విధానం అమెరికా కోల్పోయిన తయారీ రంగాన్ని పునరుజ్జీవింప జేస్తుందని నమ్ముతున్నారు, కంపెనీలు అమెరికాకు మకాం మార్చమని బలవంతం చేస్తుంది. కానీ చాలా మంది వ్యాపార నిపుణులు, ఆర్థికవేత్తలు ఇది ఇంత త్వరగా జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు -సుంకాలు పెంచుతున్నందున అధిక ద్రవ్యోల్బణం భయాలు లేకపోలేదు. మరోవంక అమెరికా విధించిన సుంకాల నుండి “రోజుకు దాదాపు $2 బిలియన్లు యూఎస్ తీసుకుంటోంది” అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
అమెరికాపై ఎవరు సుంకాలు విధించారు?
ట్రంప్ తన ప్రణాళికలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన తర్వాత, కెనడా బుధవారం నుండి కొన్ని US ఆటో దిగుమతులపై సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ట్రంప్ టారిఫ్ విధానంపై తీవ్రంగా విమర్శించిన EU – వచ్చే వారం కొత్త 20 శాతం సుంకాలకు తన ప్రతిస్పందనను వెల్లడించవచ్చు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంప్‌ను పునరాలోచించాలని పిలుపునిచ్చారు, EU స్పందించవలసి వస్తే, “అలాగే జరగాలి” అని అన్నారు.
గత నెలలో అమలులోకి వచ్చిన US ఉక్కు, అల్యూమినియం సుంకాలకు ప్రతీకారంగా, EU సోయాబీన్స్ నుండి మోటార్ సైకిళ్ల వరకు అమెరికన్ వస్తువులపై 25 శాతం వరకు సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు AFP చూసిన పత్రం తెలిపింది.
ఇదిలా ఉండగా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం తన ప్రభుత్వం వాణిజ్య భాగస్వాములతో “ఒప్పందాల”పై పనిచేస్తున్నట్లు చెప్పారు, జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు ప్రాధాన్యత ఇస్తామని వైట్ హౌస్ తెలిపింది. ఈ మేరకు అమెరికా ఉన్నత వాణిజ్య అధికారి జేమిసన్ గ్రీర్ సెనేట్‌లో మాట్లాడుతూ…అర్జెంటీనా, వియత్నాం, ఇజ్రాయెల్ తమ సుంకాలను తగ్గించడానికి ముందుకొచ్చిన వాటిలో ఉన్నాయని చెప్పారు. కాగా, చైనా ప్రతీకారం, పెరుగుతున్న దేశీయ విమర్శల నేపథ్యంలో ట్రంప్ తన దూకుడు వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించారు.