తిరువనంతపురం: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాలికట్లో సాలిడారిటీ యూత్ మూవ్మెంట్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. భాష్ఫవాయు గోళాలను ఉపయోగించారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. వక్ఫ్ చట్టంపై నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు.
కాలికట్లో నిరసన వీడియో లింక్
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి హింద్ కేరళతో అనుబంధంగా ఉన్న సాలిడారిటీ యూత్ మూవ్మెంట్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) ఈ ప్రదర్శనను నిర్వహించాయి. ఈ నిరసనకు సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు తౌఫీక్ మంబద్, SIO రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ అబ్దుల్ వాహిద్ వంటి ప్రముఖులు నాయకత్వం వహించారు. అంతేకాదు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, జమాత్-ఇ-ఇస్లామి హింద్ జాతీయ నాయకుడు మాలిక్ మోతాసిమ్ ఖాన్ దిగ్బంధనను ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ప్రముఖ దళిత నాయకుడు కె. అంబుజాక్షన్, ప్రఖ్యాత రచయిత, క్రైస్తవ నాయకుడు వై.టి.వినయరాజ్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు హమీద్ వానియంబలం, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ జింటో జాన్ సహా వివిధ వర్గాల నుండి వక్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరసనకారులు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఖండించారు, దీనిని హిందూ జాతీయవాద ప్రభుత్వం రూపొందించిన “జాతి హత్యాకాండ ప్రాజెక్ట్” అని అభివర్ణించారు. పరిస్థితి తీవ్రం కావడంతో, కేరళ పోలీసులు మాంబాద్, వాహిద్ సహా ఆరుగురు నాయకులను అరెస్టు చేశారు. నిరసన కారణంగా కాలికట్ విమానాశ్రయానికి వెళ్లే ప్రాంతంలో గణనీయమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసు చర్య సమయంలో నిరసనకారులు విమానాశ్రయానికి ప్రవేశాన్ని అడ్డుకున్నారు.
ఘర్షణలో కనీసం డజను మంది వ్యక్తులు గాయపడ్డారు. వారందరిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన వక్ఫ్ సవరణ చట్టంపై పెరుగుతున్న ఉద్రిక్తతలను ఈ ఘర్షణ ఒక నిదర్శనంగా నిలిచింది.