హైదరాబాద్ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలన్నారు. ఇది 14, 25, 26 ఆర్టికల్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ బిల్లు ముస్లిం మైనారిటీలకు ఆర్థిక స్వాలంబనగా నిలిచిన వక్ఫ్ బోర్డ్ ను ఆర్థికంగా నిర్వీర్యంగా చేసి , దాని ఆధీనంలో ఉన్న ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టటానికి, ముస్లిముల రక్షణకు భద్రత లేకుండా చేసే కుట్ర దాగి ఉన్నదని తెలిపారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో ముస్లింల ఆహార అలవాట్లు , వస్త్రధారణ , ఆచార వ్యవహారాలు, ముస్లిం ధర్మం , ముస్లింల సంస్కృతిలో జోక్యం కల్పించుకోవడం ద్వారా వారి ధార్మిక మత స్వేచ్ఛకు, భావజాలానికి భంగం కలిగించే అనేక కార్యక్రమాలను చాప కింద నీరులాగా చేపట్టిందని అన్నారు. ఈ సవరణ చట్టం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులకు అన్ని రకాలుగా బలహీనపరిచి వారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొనుటకు అనుసరిస్తున్న విధానమని అన్నారు.
కొత్తగా తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు… వక్ఫ్ ఆస్తులను నాశనం చేస్తుందని, తమ రహస్య ఎజెండాను అమలు పరుచుటకు వక్ఫ్ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చిన ప్రభుత్వం.. ముస్లిములకు, వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోని ఆస్తులకు ఏ విధముగా రక్షణ సమకూర్చుతుందో ముస్లిం సమాజం గుర్తించాలని అన్నారు. వక్ఫ్ బోర్డు కమిషనర్‌ను తొలగించి ,ఆ స్థానములో కలెక్టర్‌ను నియమించడం వెనుక కుట్ర దాగి ఉందని వారన్నారు. దానం రూపములో ముస్లిములకు వచ్చిన ఆస్తులపై తమ అజమాయిషీ చెలాయించి, ముస్లిములను బానిసలుగా మార్చే ప్రయత్నాలను అందరూ అర్థం చేసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
భారతదేశానికి స్వాతంత్రం సమకూర్చే క్రమంలో ఎందరో ముస్లింలు అమరులైనప్పటికీ చరిత్రను వక్రీకరిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ముస్లిమేతరులందు వ్యాప్తి చేస్తూ సోదరభావాన్ని నాశనం చేసిందన్నారు. అంతేకాదు ముస్లింలను ఒంటరిగా చేసి సంఘవిద్రోహులుగా చిత్రీకరించడం , ముస్లిములు హిందువులకు వ్యతిరేకం అనే భావాన్ని కలిగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం చాలా విచారకరమని వక్తలు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దెల రామ్మూర్తి, టి పి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ , సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హలావత్ లింగన్న పాల్గొన్నారు.
అంతేకాదు ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్ , మా అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డుపల్లి ఉపేంద్ర, మా ప్రధాన కార్యదర్శి మందుల రఘు, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, దూదేకుల సంఘం బాధ్యులు నాజర్, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు ఎం.ఏ.సత్తార్, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలశెట్టి రమేష్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ,
అలాగే ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామ సంజీవరావు, న్యాయవాది మామిండ్ల సత్యనారాయణ, టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చెంచు శ్రీశైలం, యుటిఎఫ్ అధ్యక్షులు మల్లారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, మహబూబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ అడ్వైజరీ కమిటీ సభ్యులు మహమ్మద్ ఫరీద్, మహమ్మద్ ఖలీల్, సలహాదారులు ముక్తి ఆలంగీర్, కమిటీ సభ్యులు ఎండి జాకీర్ హుస్సేన్, ఆసిఫ్ అలీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.