కైరో: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి, ఇజ్రాయెల్‌లో జైలులో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఇజ్రాయెల్ బందీలను మార్పిడి చేయడానికి హమాస్ సమగ్ర ఒప్పందాన్ని కోరుకుంటుందని, పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ మధ్యంతర యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని అన్నారు.
ఓ టెలివిజన్ ప్రసంగంలో, చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్రూప్ గాజా చీఫ్ ఖలీల్ అల్-హయ్యా మాట్లాడుతూ… తమ గ్రూప్ ఇకపై మధ్యంతర ఒప్పందాలకు అంగీకరించదని అన్నారు. మధ్యంతర ఒప్పందాల పేరుతో ఇటీవలి తిరిగి ప్రారంభమైన విధ్వంసకర దాడుల ముగింపు మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మధ్యతర ఒప్పందానికి బదులుగా, గాజా యుద్ధాన్ని ముగించడం, ఇజ్రాయెల్ జైలులో ఉన్న పాలస్తీనియన్ల విడుదల, గాజా పునర్నిర్మాణం కోసం ప్రతిఫలంగా తమ వద్ద ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయడానికి హమాస్ వెంటనే “సమగ్ర ప్యాకేజీ చర్చలలో” పాల్గొనడానికి సిద్ధంగా ఉందని హయా అన్నారు.
“నెతన్యాహు, అతని ప్రభుత్వం తమ రాజకీయ ఎజెండాకు ఒక ముసుగుగా పాక్షిక ఒప్పందాలను ఉపయోగిస్తున్నారు,ఇది వారి ఖైదీలందరి (బందీలు) ప్రాణాలను బలిగొన్నప్పటికీ, వినాశనం,ఆకలితో కూడిన యుద్ధాన్ని కొనసాగించడంపై ఆధారపడి ఉంటుంది” అని హయా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి అన్నారు. “ఈ విధానాన్ని ఆమోదించడంలో మేము భాగం కాము అని హమాస్ ప్రతినిధి అన్నారు.
కాగా, గత నెలలో గాజాలో ఆగిపోయిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ఈజిప్టు మధ్యవర్తులు కృషి చేస్తున్నారు, అయితే ఇజ్రాయెల్,హమాస్ ఒకరినొకరు నిందించుకోవడంతో పురోగతి కనిపించడం లేదు. హమాస్ వ్యాఖ్యలు వారికి శాంతి పట్ల ఆసక్తి లేదని, నిరంతర హింస పట్ల ఆసక్తి ఉందని సూచిస్తున్నాయని అమెరికా రక్షణ ప్రతినిధి జేమ్స్ హెవిట్ అన్నారు.
కాల్పుల విరమణను పునరుద్ధరించడానికి, ఇజ్రాయెల్ బందీలను విడిపించడానికి సోమవారం కైరోలో జరిగిన తాజా రౌండ్ చర్చలు స్పష్టమైన పురోగతి లేకుండా ముగిశాయని పాలస్తీనా, ఈజిప్టు వర్గాలు తెలిపాయి. బందీల విడుదలను అనుమతించడానికి, యుద్ధాన్ని ముగించడానికి పరోక్ష చర్చలను ప్రారంభించడానికి గాజాలో 45 రోజుల కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టాలనే షరతులలో ఒకదాన్ని ఇప్పటికే తిరస్కరించింది. ఇజ్రాయెల్ “అసాధ్యమైన షరతులతో” ఒప్పందం కుదరకుండా అడ్డుపడుతోందని హమాస్ ప్రతినిధి హయ్యా ఆరోపించాడు.
జనవరి 19న ప్రారంభమైన కాల్పుల విరమణ కింద హమాస్ 38 మంది బందీలను విడుదల చేసింది. మార్చిలో, ఇజ్రాయెల్ సైన్యం గాజాపై తన భూ, వైమానిక దాడిని తిరిగి ప్రారంభించింది, యుద్ధాన్ని ముగించకుండా కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిన తర్వాత కాల్పుల విరమణను విరమించుకుంది.
మిగిలిన 59 మంది బందీలను విడిపించే వరకు గాజాలో సైనిక దాడి కొనసాగుతుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో భాగంగా మాత్రమే బందీలను విడిపిస్తామని హమాస్ పట్టుబడుతోంది, ఆయుధాలను విడిచిపెట్టాలనే డిమాండ్లను తిరస్కరించింది.
ఇజ్రాయెల్ దాడులు
మంగళవారం, హమాస్ సాయుధ విభాగం ఇజ్రాయెల్ సైన్యం వారి రహస్య స్థావరంపై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్-అమెరికన్ బందీ ఎడాన్ అలెగ్జాండర్‌ను పట్టుకున్న ఉగ్రవాదులతో తమ బృందం సంబంధాన్ని కోల్పోయిందని తెలిపింది. అలెగ్జాండర్ న్యూజెర్సీ స్థానికుడు. ఇజ్రాయెల్ సైన్యంలో 21 ఏళ్ల సైనికుడు.
తరువాత సాయుధ విభాగం బందీల కుటుంబాలను హెచ్చరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది, ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే మీ పిల్లలు నల్ల శవపేటికలలో తిరిగి వస్తారు, వారి శరీరాలు ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకుల కింద నలిగిపోతాయని హమాస్ ప్రతినిధి అన్నారు.
గురువారం గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 32 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలపై జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది, దీనిలో 1,200 మంది మరణించారు. 251 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారని ఇజ్రాయెల్ లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుండి, ఇజ్రాయెల్ దాడిలో 51,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.