హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న బృందం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టింది. గ్లోబల్ ఐటీ సేవల సంస్థ అయిన NTT డేటా, హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో AI డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టోక్యోలో జరిగిన ఉన్నతస్థాయీ సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టులో AI సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతుగా 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన 400 MW డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు NTT డేటా, AI క్లౌడ్ ప్లాట్‌ఫామ్ కంపెనీ నేసా నెట్వర్క్స్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను భారీగా ఆకర్షించడంలో దోహదపడుతున్నాయని అన్నారు. నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుంది. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభా నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం ఆగామిగా నిలుస్తుంది. ఈ ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని” సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలో తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్‌ను నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాదునిక కూలింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు.
ఈ ప్రాజెక్టును అత్యున్నత ఈఎసీ(ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది.ఈ పెట్టుబడి హైదరాబాద్‌లోని AWS, STT, టిల్మాన్ హోల్డింగ్స్, CtrlS ద్వారా ఇటీవలి డేటా సెంటర్ ప్రాజెక్టులను అనుసరిస్తుంది.
మొత్తంగా జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించడంలో దూసుకెళ్తోంది. మొదటిరోజున ప్రముఖ వ్యాపార సంస్థ మరుబెనీ సంస్థ దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక రెండో రోజు టాప్ గేర్‌లో దూసుకెళ్లిపోతోంది. ఇందులో భాగంగా.. తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) రూ. 562 కోట్లతో తయారీ కంపెనీ పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.