బెంగళూరు: కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ ఆదివారం బెంగళూరులోని వారి ఇంట్లోనే ఆయన భార్య చేతిలో హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఆయనకు 68 ఏళ్లు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి మూడంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భోజనం చేస్తున్న సమయంలో ఓం ప్రకాష్ తన భార్య పల్లవితో వాగ్వాదానికి దిగాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గొడవ తీవ్రమయ్యాక… భార్య పల్లవి అతనిపై దాడి చేసి, ఆపై రెండు కత్తులతో అతని మెడ, తల వెనుక భాగంలో కనీసం ఆరుసార్లు పొడిచిందని పోలీసులు చెబుతున్నారు. అతను 10 నిమిషాల పాటు కుప్పకూలిపోయి నొప్పితో వణుకుతుండగా, ఆమె కుర్చీపై కదలకుండా కూర్చున్నట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ఆ సమయంలో ఆ దంపతుల పెళ్లికాని కుమార్తె కృతి మేడమీద ఉంది, కానీ ఆమె ప్రమేయం ఉందని పోలీసులు అనుమానించడం లేదు. ఆ దంపతుల కోడలు తరువాత ఇంటికి వచ్చింది.
పల్లవి తరువాత ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యకు ఫోన్ చేసి, తర్వాత పోలీసు హెల్ప్‌లైన్ 112కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు అధికారులు డైనింగ్ టేబుల్‌పై రక్తపు మరకలు, ఇంకా ఒక ప్లేట్ ఆహారం కనిపించాయని గుర్తించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) సారా ఫాతిమా నేతృత్వంలోని అధికారుల బృందం పల్లవి, ఇతర కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. తరువాత పల్లవిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కోసం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీజీబీ-ఐజీపీ అలోక్ మోహన్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆస్తి వివాదం హత్యకు ప్రధాన కారణం అని వర్గాలు గుర్తించాయి. ఓం ప్రకాష్ తన తోబుట్టువులలో ఒకరికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినందుకు పల్లవి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం
వైవాహిక విభేదాలు కూడా ఉన్నాయి. ఇటీవలి నెలల్లో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, పల్లవి ఒకప్పుడు తన భర్తకు వ్యతిరేకంగా ఇంటి బయట నిరసన తెలిపేదని, పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారుల కుటుంబ సభ్యులతో అతని గురించి తరచుగా చెడుగా మాట్లాడేదని పోలీసు దర్యాప్తులో తేలింది.
ఆదివారం సాయంత్రం వివిఐపి భద్రతా విభాగంలో పనిచేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ విలేకరులతో మాట్లాడుతూ… ఓం ప్రకాష్ మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో తనకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడాడని చెప్పారు.
“నేను అతనిని కలవాలనుకున్నాను కానీ అతను నన్ను రావద్దని అన్నాడు. ఇంట్లో భార్య ఉందని, పోలీసు శాఖ నుండి సందర్శకులు రావడం ఆమెకు ఇష్టం లేదని చెప్పాడని” గౌడ చెప్పారు. కాగా, రిటైర్డ్ డిజి & ఐజిపి భార్య కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ నుండి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. హత్య అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. మృతదేహాన్ని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని మార్చురీ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. నేడు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని పిప్రాసి గ్రామానికి చెందిన ప్రకాష్ 1981 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. అతను ఫిబ్రవరి 28, 2015న కర్ణాటక డిజి & ఐజిపిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 జనవరిలో పదవీ విరమణ చేశారు.