హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ అధికారిక పర్యటన ఈరోజుతో ముగుస్తుంది. తన పర్యటన చివరి రోజున, ముఖ్యమంత్రి, ఆయన ప్రతినిధి బృందం హిరోషిమాను సందర్శిస్తారు. అక్కడ ఆయన హిరోషిమా శాంతి స్మారక చిహ్నాన్ని దర్శించి… శాంతి-అహింస సందేశాన్ని గౌరవిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు అర్పిస్తారు.
అంతేకాదు హిరోషిమా వైస్ గవర్నర్, హిరోషిమా అసెంబ్లీ ఛైర్మన్‌తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ చర్చలు తెలంగాణ, హిరోషిమా ప్రాంతం మధ్య సహకారానికి గల అవకాశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రతినిధి బృందం అదనంగా హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తుంది, విద్యా, పారిశ్రామిక భాగస్వామ్యాలకు మార్గాలను అన్వేషిస్తుంది. ఆ తర్వాత, ముఖ్యమంత్రి , ఆయన బృందం రేపు ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు.
కాగా, నిన్న ఒసాకాలో జపాన్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారుచేయండి.. భారత మార్కెట్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి.. తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి.. అని వారిని సాదరంగా ఆహ్వానించారు.
సీఎం మాట్లాడుతూ… తెలంగాణ, ఒసాకా కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు రండి… మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. కలిసి పనిచేద్దాం.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం.. ‘అంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు.
ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పోలో వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉందని సీఎం అన్నారు.
తెలంగాణ, జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. మా ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి..’అని సీఎం చెప్పారు.