శ్రీనగర్ : ప్రశాంతతకు మారుపేరైన పహల్గామ్ నెత్తురోడింది. దక్షిణ అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ లోయలో సందర్శకుల బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 28 మంది పౌరులు, ఎక్కువగా పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.
నిన్న మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో పర్యాటకులు – వీరిలో చాలా మంది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన కుటుంబాలు – బైసరన్ లోని పచ్చిక బయళ్లలో విహరిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని “మినీ స్విట్జర్లాండ్” అని పిలుస్తారు. మృతులలో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నారని పోలీసులు ధృవీకరించారు, అయితే వీరి గుర్తింపు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.
సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించడంతో గందరగోళం, భయానక దృశ్యాలను తాము చూశామనిప్రత్యక్ష సాక్షులు వివరించారు. “మేము ఆకస్మిక కాల్పుల శబ్దాలు విన్నాము, ప్రజలు కేకలు వేయడం, దాక్కోవడానికి పరిగెత్తడం ప్రారంభించారు” అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. “ఇదంతా చాలా వేగంగా జరిగిపోయిందని వారు తెలిపారు.”
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని “భయంకరమైన, ప్రణాళికాబద్ధమైన మారణహోమం” అని అభివర్ణించారు. ఈ విషాదం “ఇటీవలి సంవత్సరాలలో పౌరులపై మనం చూసిన దాడులలో చాలా పెద్దది” అని సీఎం అన్నారు. మరణాల సంఖ్య తరువాత అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) తో అనుబంధంగా భావిస్తున్న సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని నిఘా అధికారులు అనుమానిస్తున్నారు, ఉగ్రవాదులు జమ్మూలోని కిష్త్వార్ ప్రాంతం నుండి చొరబడి దక్షిణ కాశ్మీర్‌లోని కోకెర్నాగ్ ద్వారా బైసరన్‌కు చేరుకున్నారు.
దాడి జరిగిన వెంటనే బైసరన్ లోయ చుట్టూ ఉన్న అడవులలో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. రక్షణ, తరలింపు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పోలీసు, సైన్యం, ఉగ్రవాద నిరోధక విభాగాల సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ దాడి ముఖ్యంగా వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కేవలం పది వారాల ముందు జరగడం గమనార్హం. దాడి జరిగిన పహల్గామ్ ప్రాంతం… ఈ యాత్రకు బేస్ క్యాంపులలో ఒకటిగా పనిచేస్తుంది.
వసంత రుతువులో పర్యాటక సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరగడం, కాశ్మీర్ లోయను అస్థిరపరిచేందుకు, సందర్శకులలో భయాన్ని కలిగించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు. దీంతో దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అనేక ట్రావెల్ ఏజెన్సీలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు నివేదించాయి.
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉగ్రవాద దాడిని ఖండించారు. ఈమేరకు ప్రధాని Xలో పోస్ట్‌లో… “జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధితులకు సాధ్యమైన సహాయం అందిస్తున్నాం. ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోము! వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం మరింత బలపడుతుంది” అని ప్రధాని మోదీ Χ లో రాశారు.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఉగ్రవాద దాడిని ఖండించారు. “పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన పిరికిపంద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇటువంటి హింస ఆమోదయోగ్యం కాదు, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని ఆమె Xలో పోస్ట్ చేసింది.
ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ నేతలు
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడిని ప్రపంచ నేతలు ఖండించారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఉన్నారు. ఈ క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్థన ఉండదని పుతిన్ పేర్కొన్నారు. ఉగ్రవాద మద్దతుదారులు తగినవిధంగా శిక్షింపబడుతారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సహకరిస్తామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.